ప్రచార బరిలోకి బడా లీడర్లు..పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకుంటున్న ఎంపీ , ఎమ్మెల్యేలు

ప్రచార బరిలోకి బడా లీడర్లు..పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకుంటున్న ఎంపీ , ఎమ్మెల్యేలు

మెదక్, వెలుగు: మున్సిపల్​ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. ఇంకా ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వనప్పటికీ... ప్రచారానికి  కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. పార్టీ  అభ్యర్థిత్వం ఖరారైన క్యాండిడేట్స్, తమకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని భావిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల కోసం పట్టణాలకు చెందిన ఆయా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు. 

వారిలో చాలా మంది ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల లో కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేస్తున్నారు. కొందరు చైర్మెన్ పదవి రేసులో ఉన్నారు. ఇదివరకు తమ గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తల గెలుపు బాధ్యతను  ఎంపీ, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్ లను గెలిపించడమే టార్గెట్ గా పెట్టుకుని తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచించడంతో పాటు, స్వయంగా ప్రచారం చేస్తున్నారు.

 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావించి తామే అభ్యర్థులం అన్నట్టు ఇంటింటి ప్రచారం సైతం చేస్తున్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రతిరోజు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. మెదక్ పట్టణంలో అభివృద్ధి పనులకు భారీ ఎత్తున నిధులు మంజూరు అయిన విషయం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. వార్డుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. 

 మెదక్, రామాయంపేట మున్సిపల్ పట్టణాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృషి చేస్తున్నారు. 

 నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ఆ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి సవాల్ గా తీసుకున్నారు. కౌన్సిలర్ వివిధ రూపాల్లో సర్వేలు చేయించి కౌన్సిలర్​ అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ప్రచారానికి శ్రీకారం చుట్టిన సునీతారెడ్డి పార్టీ క్యాండిడేట్స్  ఖరారయ్యక మరింత ముమ్మరం చేశారు. 

నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి సైతం ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు.
 
  గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ స్తానంలో పోటీ చేసి ఓడిపోయిన, నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన  ప్రచారం చేస్తున్నారు. 

 జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బీ జే పీ అభ్యర్థులకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేపట్టారు. నామినేషన్ ల ఉప సంహరణ పూర్తి అయ్యాక మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేసేలా ఆయన ప్రణాళిక రెడీ చేస్తున్నారు.