
ఫిలింనగర్ అగ్నిప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించింది. బాధితులకు సహాయం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. బాధితులకు ఎక్స్ గ్రేషియా అందించాలని జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక వారం రోజుల్లో బాధితులకు చెక్కులు అందిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితం ఫిలింనగర్ లోని దుర్గాభవన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఇండ్లు తగులబడిపోయాయి. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. తమకు ఉండటానికి ఇల్లు లేదని.. ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.