
న్యూఢిల్లీ: 2020 గాల్వన్ లోయ దాడి ఘటనతో భారత్, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత ఇటీవల ఇండియా, డ్రాగన్ కంట్రీ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2020లో బ్యాన్ చేసిన ప్రముఖ చైనా యాప్‌లు టిక్ టాక్, అలీ ఎక్స్‌ప్రెస్, షీన్ వంటివి తిరిగి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భారతదేశంలో టిక్‌టాక్, అలీ ఎక్స్‌ప్రెస్, షీన్ వంటి చైనా యాపులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. టిక్ టాక్ భారత మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలను కేంద్రం తోసిపుచ్చింది.
డేటా భద్రత, గోప్యతపై ఆందోళనలను పేర్కొంటూ టిక్‌టాక్, అలీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు అనేక ఇతర చైనీస్ యాప్‌లను 2020, జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు, దేశ రక్షణకు, రాష్ట్ర భద్రత, ప్రజా క్రమానికి పక్షపాతం చూపుతున్నాయని కారణంతో 58 చైనా యాపులపై బ్యాన్ విధించింది.
►ALSO READ | పాక్ ఫ్లయిట్లకు నో ఎంట్రీ: గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించిన భారత్
బ్యాన్ చేసిన వాటిల్లో షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్ టాక్, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అలీఎక్స్‌ప్రెస్, మహిళల దుస్తుల ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షీన్ వంటి ప్రముఖ యాప్‌లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్, చైనా మధ్య పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ యాపులు తిరిగి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.