
- దవాఖాన్లు, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు
- ఆర్థిక శాఖ ఆమోదించినా.. నోటిఫికేషన్ ఇవ్వని సర్కార్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి 5 నెలలు అవుతున్నా.. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఎప్పటిలాగే టెంపరరీ అరేంజ్‌మెంట్స్‌పై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. హాస్పిటళ్ల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు డాక్టర్లను నియమించుకుంటోంది. ఆదిలాబాద్ రిమ్స్, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. రిమ్స్‌కు సంబంధించి 16న, సూర్యాపేట హాస్పిటల్‌కు 19న, సిద్దిపేటకు సంబంధించిన నోటిఫికేషన్ 27న, నల్గొండ దవాఖానకు సంబంధించిన నోటిఫికేషన్ 29న విడుదల చేశారు. నిజామాబాద్ కాలేజీలో 17 ఖాళీలను 10 రోజుల కిందే కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేశారు. అన్ని చోట్ల కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ఉద్యోగాల కాలపరిమితి 9 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటళ్లలో స్పెషలిస్టు డాక్టర్ల పోస్టులను జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీన్ని బట్టి స్పెషలిస్టు పోస్టుల భర్తీ ఇప్పట్లో జరిగేలా లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
ప్రకటనలకే పరిమితం
మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్‌లో 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా హాస్పిటల్స్‌లో 1,200 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చిలోనే ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. త్వరలో నోటిఫికేషన్, వారంలో నోటిఫికేషన్ అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు జారీ చేశారు. కానీ, ఇప్పటివరకు ఇందులో ఒక్క పోస్టుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎంబీబీఎస్ అర్హతతో ఉన్న 1,326 పోస్టులకు మాత్రం జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇందులో 357 పోస్టుల భర్తీని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన పోస్టుల అప్లికేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సుమారు 6,600 నర్సింగ్ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం లభించినా, రిక్రూట్‌మెంట్‌కు మాత్రం నోచుకోవడం లేదు. అవసరమైన దవాఖాన్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నర్సులను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ రిక్రూట్‌మెంట్లన్నీ లోలోపలే జరిగిపోతున్నాయి.