ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ :  దేశీయంగా లభ్యతను పెంచేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఉల్లిపై ఎగుమతి నిషేధాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించింది. గతంలో ఈ ఏడాది మార్చి 31 వరకు ఎగుమతులను నిషేధించారు. మార్చి 31, 2024 వరకు చెల్లుబాటు అయ్యే ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించామని  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) తెలిపింది.  మనదేశం డిసెంబర్ 8, 2023న ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది.

2023 రబీ సీజన్‌‌లో ఉల్లి ఉత్పత్తి 22.7 మిలియన్ టన్నులు వస్తుందని అంచనా. మిత్రదేశాలకు ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి అంతర్-మంత్రిత్వ బృందం నుంచి ఆమోదం పొందిన తర్వాత కేసుల వారీగా అనుమతిస్తామని డీజీఎఫ్​టీ ప్రకటించింది. నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్​సీఈఎల్​) ద్వారా యూఏఈ,  బంగ్లాదేశ్‌‌లకు 64,400 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అంతకుముందు, 2023 అక్టోబర్‌‌లో, వినియోగదారులకు

ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్‌‌లలో కిలోకు 25 రూపాయల సబ్సిడీ రేటుతో బఫర్ ఉల్లిపాయ స్టాక్‌‌ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం గతంలో అనేక చర్యలు తీసుకుంది. అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై టన్నుకు  800 డాలర్ల కనిష్ట ఎగుమతి ధర (ఎంఏపీ) విధించింది. గత ఆగస్టులో, భారతదేశం డిసెంబర్ 31, 2023 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.