
ప్రభుత్వ దవాఖానాలకు మందుల కొనుగోలులో జరుగుతున్న గోల్‌మాల్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సూచనలతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. డిమాండ్, సప్లై ప్రతిపాదికనే మందులు కొనాలని నిర్ణయించారు. ఆస్పత్రుల ఇండెంట్ నుంచి మందులు రోగికి చేరే వరకూ పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. మందుల రవాణా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌తో పర్యవేక్షించనున్నారు. ఇటీవల నాంపల్లి పీహెచ్‌సీకి అవసరం లేకున్నా 10 వేల మాత్రలు పంపడం, వాటివల్లే ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కింద నుంచి పై స్థాయి వరకూ మందుల కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు నిర్ధారణకొచ్చారు. అందుకే మందుల కొనుగోలును ప్రక్షాళన చేయాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది.
ఇకపై కొనుగోలు ఇలా..
మందుల కొనుగోలులో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి వల్ల అక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. కొంతమంది ఫార్మసిస్టులు, అధికారులు, మందుల కంపెనీల ప్రతినిధులు కుమ్మక్కై అవసరం లేకున్నా మందులు కొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఇటీవలి నాంపల్లి పీహెచ్‌సీ ఘటనే నిదర్శనం. అందుకే ఈసారి ప్రతి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉండేలా కొత్త విధానం రూపొందించారు. ఉదాహరణకు.. మంథనిలోని ఓ పీహెచ్‌సీలో నెలకు ఏయే మందులు, ఎంత మేర అవసరమో అక్కడి ఫార్మసిస్టు, హాస్పిటల్ హెడ్ నిర్ధారించి ఆన్‌లైన్‌లో ఇండెంట్ పెడతారు. అక్కడ అన్ని మందులు అవసరమో లేదో మెడికల్ ఆఫీసర్లు తెలుసుకుంటారు. అన్ని ఆస్పత్రుల నుంచి ఇండెంట్ల వచ్చాక టీఎస్ ఎంఐడీసీ బల్క్‌లో మందుల కొంటుంది. అవి టీఎస్ ఎండీసీకి చేరాక ఇండెంట్లు, కొనుగోలు చేసిన మందుల లెక్క చూసుకుంటుంది.
అడుగడుగునా నిఘా
హైదరాబాద్‌లోని టీఎస్‌ఎంఐడీసీ ఆఫీసు నుంచి ప్రత్యేక వాహనాల్లో దవాఖానాలకు మందులు చేరవేస్తారు. వాటికి జీపీఎస్ సిస్టమ్, కెమెరాలు అమర్చి హైదరాబాద్‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాయలంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు. ఇక్కడ్నుంచి వాహనాల కదలికలను గమనిస్తుంటారు. దవాఖాన్లకు మందులొచ్చాక ఎన్నొచ్చాయో అక్కడి అధికారి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. దీని వల్ల వాహనాలను మధ్యలో ఆపి మందులు మార్చడం, దారి మళ్లించడం వంటి పనులకు అడ్డుకట్ట పడుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక దవాఖాన్లలో మందులు అమ్ముకోవడం, మార్చడం గతంలో జరిగాయి. వీటికీ చెక్ పెట్టేందుకు మందులు ఏ రోగికి ఇస్తున్నరో నమోదు చేసేలా ఆన్‌లైన్ విధానం తెచ్చినట్టు సమాచారం. మందుల కొనుగోలులో దవాఖాన హెడ్ నుంచి టీఎస్‌ఎంఐడీసీ ఎండీ వరకూ బాధ్యులను చేయడంతో అవతవకలకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.