
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డుతో సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 13 నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ ఇచ్చిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదయిందని చెప్పారు. హైదరాబాద్ సిటీలో ఎక్కువ వర్షపాతం నమోదైతే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందో లిస్ట్ తీసి రెడీ గా పెట్టుకున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో వర్షానికి ముందస్తుగానే తమ టీమ్స్ ఉంటున్నాయన్నారు.
కృష్ణా నగర్ లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని చెప్పారు కమిషనర్ ఆర్వీ కర్ణన్. మైత్రీ వనం దగ్గర వరద ప్రభావం లేకుండా సీఎం ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ కి వచ్చే ప్రతీ కంప్లెయింట్ ను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 13 నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలున్నందున అవసరమైతే తప్ప పబ్లిక్ బయటకు రావద్దని సూచించారు కమిషనర్.
ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 13 నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణం శాఖ వెల్లడించింది. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.