
అసిమ్ మునీర్ పాకిస్థాన్ లో అత్యంత వివాదాస్పదమైన ఆర్మీ లీడర్. ఆయన తన సొంత దేశంలోని ప్రజల నుంచే వ్యతిరేకతను పొందుతున్నప్పటికీ అమెరికా మాత్రం స్నేహం పెంచుకుంటోంది. పాకిస్థాన్ లోని రాజకీయాలను, ప్రతిపక్ష నేతల నుంచి జర్నలిస్టులను కూడా తొక్కిపెట్టి తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు మునీర్. ఇదే సమయంలో అమెరికాతో పాక్ సంబంధాలు మెరుగుపడటానికి మునీర్ సెంటర్ గా మారటం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
కేవలం రెండు నెలల్లోనే అమెరికాకు రెండు సార్లు పర్యటించటం.. ప్రెసిడెంట్ ట్రంప్ తర్వాత తాజాగా యూఎస్ మిలిటరీ పెద్దలతో చర్చలు జరపటం రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలపరుస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే పాక్ లో పెట్టుబడులు పెంచేందుకు సహాయం చేయాలని అమెరికా పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు మునీర్. అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం అసలు ట్రంప్ ఒక్కసారిగా ఇండియాను దూరం పెట్టి పాక్ పెద్దలతో ఎందుకు స్నేహం పెంచుకుంటున్నారన్నదే.
వాస్తవానికి దక్షిణ ఆసియాలో పవర ఫుల్ దేశంగా ఇండియా కొనసాగుతోంది. అయితే తన మాట లెక్కచేయని భారత్ పై 50 శాతం, చెప్పింది చేసుకుంటూ పోతున్న పాక్ పై 19 శాతం పన్నులతో దీనిని మార్చాలనుకుంటోంది అమెరికా. ఈ క్రమంలోనే అమెరికా పాక్ లో మెగా ఆయిల్ రిజర్వు కాంప్లెక్స్ నిర్మించటానికి ముందుకొచ్చింది. అలాగే మరిన్ని పెట్టుబడి అవకాశాలను యూఎస్ అన్వేషిస్తోంది. పాక్ సీనియర్ జనరల్స్ అమెరికాను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించటమే ట్రంప్ ఆసక్తికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఉగ్రవాద నిరోధించటంలో సహాయం, ట్రంప్ సన్నిహితులతో వ్యాపార సంబంధాలు, అమెరికాతో ఎనర్జీ డీల్స్, ఖనిజాల ఒప్పందాలు, క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు వంటి అంశాలతో వైట్ హౌస్ మెప్పు పొందుతోంది పాకిస్థాన్. ప్రధానంగా అమెరికాకు ఐఎస్ఐఎస్ కే, తెహరిక్ ఐ తాలిబాన్ పాకిస్థాన్ వంటి సంస్థలను మట్టుకరిపించటంలో సహాయం యూఎస్ మన్ననలు పొందటానికి కారణంగా మారిందని తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో అమెరికా తన అత్యాధునిక ఆయుధాలాను పాకిస్థాన్ కి అమ్మేందుకు ముందుకు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.