
- డీడీలు కట్టి నాలుగు నెలలాయే..
- లబ్ధిదారుల ఎదురు చూపులు
మెదక్ (చిలప్‌చెడ్, నిజాంపేట), వెలుగు: గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పెరటి కోళ్ల పెంపకం స్కీమ్ ముందుకు సాగడం లేదు. వెటర్నరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో సబ్సిడీతో నాణ్యమైన పెరటి కోళ్లను అందించాలని నిర్ణయించిన సర్కారు.. లబ్ధిదారులు వాటాను బ్యాంక్ డీడీ రూపంలో కట్టాలని సూచించింది. ఈ మేరకు చిలప్‌చెడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది నాలుగు నెలల కింద, నిజాంపేట మండలంలోని గ్రామాలకు చెందిన 74 మంది మూడు నెలల కింద రూ.600 చొప్పున డీడీలు తీసి అప్లై చేసుకున్నారు. నేటికీ యూనిట్లు గ్రౌండ్ కాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
415 యూనిట్లు మంజూరు
ఈ స్కీమ్ కింద గత నవంబర్ లో మెదక్ జిల్లాలోని 21 మండలాలకు కలిపి 415 యూనిట్స్ మంజూరయ్యాయి. చిలప్‌చెడ్, హవేలి ఘనపూర్, నార్సింగి, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, వెల్దుర్తి, శివ్వంపేట, పాపన్నపేట, అల్లాదుర్గం, పెద్ద శంకరంపేట, రేగోడ్, టేక్మాల్, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, కొల్చారం మండలాలకు 20 యూనిట్ల చొప్పున (ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, ఇతరులకు 15) కేటాయించగా, మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, మనోహరాబాద్ మండలాలకు 19 యూనిట్ల చొప్పున ( ఎస్సీలకు3, ఎస్టీలకు 2, ఇతరులకు 14) కేటాయించారు.
యూనిట్‌కాస్ట్.. సబ్సిడీ ఇలా
ఒక్కో యూనిట్ కింద నెల రోజుల వయసున్న 25 కోడి పిల్లలను వ్యాక్సినేషన్ చేసి అందజేస్తారు. ఒక్కో యూనిట్ కాస్ట్ రూ.1,850 కాగా ఇందులో రూ.1,250 సబ్సిడీ. ఇది పోను లబ్ధిదారులు తమ వంతు వాటాగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. వెటర్నరీ డిపార్ట్ మెంట్ సూచన మేరకు ఆసక్తి ఉన్న వారు తమ వాటా అమౌంట్ కు బ్యాంక్‌లో డీడీలు తీసి సంబంధిత అధికారులకు అందజేశారు. డీడీకట్టి నాలుగు నెలలవుతున్నా నేటికీ ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు.
డీడీ ఇచ్చి నాలుగు నెలలైంది
వెటర్నరీ డాక్టర్ చెబితే నాలుగు నెలల కింద పెరటి కోళ్ల పెంపకం యూనిట్ కోసం బ్యాంక్ లో డీడీ తీసి ఇచ్చిన. కానీ ఇంతవరకు పెరటి కోడి పిల్లలు రాలేదు. చిట్కుల్ వెటర్నరీ హాస్పిటల్‌కు ఎన్నిసార్లు వెళ్లి అడిగినా అధికారులు సమాధానం చెప్తలేదరు. సర్కారు స్పందించి పెరటి కోడి పిల్లలు ఇవ్వాలి.
- నవీన్ రెడ్డి, శిలాంపల్లి, చిలప్‌చెడ్ మండలం
త్వరలో గ్రౌండింగ్
గ్రామీణ పెరటి కోళ్ల పెంపకం స్కీమ్ అమలు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. సబ్సిడీ మంజూరు కాగానే యూనిట్లు గ్రౌండ్ అవుతాయి. స్కీం గైడ్ లైన్స్ ప్రకారం లబ్ధిదారు వాటా బ్యాంక్‌లో డీడీ తీసి ఇచ్చిన వారికి త్వరలో కోడి పిల్లలు పంపిణీ చేస్తాం.
– విజయ శేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్