యూనియన్​ ఆఫీస్​కు తాళం.. నేతలకు చెక్​పెట్టేందుకు ప్రయత్నాలు

యూనియన్​ ఆఫీస్​కు తాళం.. నేతలకు చెక్​పెట్టేందుకు ప్రయత్నాలు
  • కార్మిక నేతలకు చెక్ పెట్టేందుకు సర్కారు, మేనేజ్​మెంట్​ ప్రయత్నాలు!
  • కార్మిక నేతలకు డ్యూటీ రిలీఫ్‌ రద్దు
  • ఇక నుంచి నేరుగా కార్మికులతోనే సంప్రదింపులు
  • నేతలకు అపాయింట్​మెంట్​ ఇవ్వని రవాణా మంత్రి పువ్వాడ
  • డిపోకు ఐదుగురితో కమిటీలు.. వారితోనే సంప్రదింపులు
  • గుర్తింపు సంఘం ఎలక్షన్​ను పక్కనపెట్టే యోచన

హైదరాబాద్‌, వెలుగు:

ఆర్టీసీలో యూనియన్లకు చెక్​పెట్టేందుకు, కార్మికులు యూనియన్లను దూరం పెట్టేలా ప్రయత్నాలు మొదలయ్యాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం బస్‌ భవన్‌లో ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ టీఎంయూ ఆఫీసుకు తాళం వేయడం, కార్మిక నేతల రిలీఫ్‌ డ్యూటీల రద్దు వంటివి జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. ‘‘ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నరు. సంస్థ దెబ్బతింటున్నది వాటి వల్లే.. అసంబద్ధ డిమాండ్లు, అనాలోచిత సమ్మెతో ఇంత దూరం తెచ్చిండ్రు. ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండవు’’ అని సీఎం కేసీఆర్​ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ దిశగా ఆర్టీసీ మేనేజ్​మెంట్  చర్యలు మొదలుపెట్టిందని ఓ అధికారి చెప్పారు.

టీఎంయూ ఆఫీసుకు తాళం

ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘానికి బస్‌ భవన్‌లో ఆఫీసు కేటాయిస్తారు. దానిని యూనియన్‌ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు బస్​భవన్​లో టీఎంయూకు ఆఫీసు ఉంది. సమ్మె ముందుదాకా కూడా టీఎంయూ నేతలు దానిని ఉపయోగించారు. సమ్మె మొదలయ్యాక అధికారులు బస్‌ భవన్‌లోకి ఎవరినీ రానివ్వలేదు. దాంతో సమ్మె సమయంలో టీఎంయూ పాత కార్యాలయంలో యూనియన్​ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే శుక్రవారం ఆర్టీసీ అధికారులు బస్​భవన్​లోని టీఎంయూ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్‌ (విజిలెన్స్‌) రాంచందర్‌రావు, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌ ఆదేశాల మేరకు టీఎంయూ కార్యాలయానికి తాళాలు వేసినట్టు బస్ భవన్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్ రెడ్డి వెల్లడించారు.

రిలీఫ్‌  డ్యూటీలు రద్దు

యూనియన్‌  నేతల్లో కొందరికి డ్యూటీ రిలీఫ్‌ ఉంటుంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెళ్లేందుకు, డ్యూటీకి రాకున్నా జీతం అందేలా ఈ సౌకర్యం కల్పించారు. జిల్లాలో జోనల్‌ ప్రెసిడెంట్‌, సెక్రెటరీలకు ఫుల్‌ డే రిలీఫ్‌, హాఫ్‌ డే రిలీఫ్‌లు వారానికి మూడురోజులు వర్తిస్తాయి. ఇక రీజనల్‌ సెక్రెటరీలు, డిపో కార్యదర్శులకు వారానికి ఒక రోజు రిలీఫ్​ ఉంటుంది. సంస్థ ఈ డ్యూటీ రిలీఫ్‌ను రద్దు చేసింది. 30 మంది రాష్ట్ర నేతల డ్యూటీ రిలీఫ్‌ను క్యాన్సిల్‌ చేసింది. అందులో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) వారు 26 మంది, ఎంప్లాయీస్‌ యూనియన్‌  ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో ఒక్కరు ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆ నేతలంతా తప్పనిసరిగా డ్యూటీలకు హాజరుకావాల్సి ఉంటుంది. లేకుంటే జీతాలు కట్​చేస్తరు.

గుర్తింపు ఎన్నికలు ఉంటయా?

ఆర్టీసీలో రెండేండ్లకోసారి ఒకసారి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలి. గత ఎన్నికల్లో టీఎంయూ గెలిచింది. 2018 ఆగస్టు 7వ తేదీనే గడువు ముగిసింది. కానీ వివిధ కారణాలతో ఎలక్షన్​ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపొద్దని సర్కార్‌ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

కార్మికులకు హితబోధ!

కార్మికులు ఆర్టీసీ యూనియన్లకు దూరంగా ఉండేలా కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో వెళ్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రగతి భవన్‌లో జరిగే సమావేశంలో కార్మికులకు దీనిపై హితబోధ చేయొచ్చని, ఎలాంటి సమస్యలున్నా చెప్పుకొనే అవకాశం ఇస్తామని సూచించనున్నారని వెల్లడిస్తున్నాయి. యూనియన్ల అవసరం లేకుండా డిపోల్లో వర్కర్స్‌ వెల్ఫేర్‌  కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌  ఇప్పటికే ప్రకటించారు. ఇకముందు కూడా కమిటీలతోనే మాట్లాడాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన టీఎంయూ నేతలకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. యూనియన్లే లేనప్పుడు వారితో సన్మానాలు ఎక్కడవని, ప్రోత్సహించే పరిస్థితే లేదని మంత్రి అన్నట్టు తెలిసింది.

Govt, RTC management attempts to take action on RTC union leaders