మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ అనగానే సాధారణంగా రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి కిటకిటలాడే ఫంక్షన్ హాల్స్... రెండోది ప్రతి వ్యక్తి, కుటుంబం, మహిళలు ధరించే అత్యంత విలువైన వాటిలో ఒకటైన బంగారు ఆభరణాలు. బంగారం లేదా బంగారు ఆభరణాలు మన దేశంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడేటివి. ఏ శుభకార్యానికైనా, పండగకైనా మొదట బంగారం కోనేందుకే ఇష్టపడతారు, ప్రాధాన్యత ఇస్తారు. అయితే చట్టబద్ధంగా మీరు మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు తెలుసా ?
భారతదేశంలో ఒక వ్యక్తి లేదా కుటుంబం ఇంట్లో ఎంత బంగారం ఉండవచ్చనే దానిపై ఎటువంటి చట్టపరమైన పరిమితి/రూల్ లేదు. అలాగే సాధారణంగా ప్రజలు ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ దానికి తగిన అధరాలు అంటే documents చూపించాల్సి ఉంటుంది. అయితే, ఐటి దాడులు జరిగినప్పుడు ఎటువంటి ఆధారాలు అడగకుండా, స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది.
*వివాహిత స్త్రీ అయితే 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచుకోవచ్చు
*అవివాహిత మహిళ అయితే 250 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచుకోవచ్చు.
*పురుషులు అయితే 100 గ్రాముల బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు.
ఉదాహరణకు ఒక ఇంట్లో భార్య, భర్త, కూతురు ఉంటే.. వారు మొత్తం 850 గ్రాముల బంగారాన్ని అంటే 500+100+250 గ్రాములు ఎటువంటి బిల్లులు లేకపోయినా ఇంట్లో ఉంచుకోవచ్చు. నేటి ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.1.2 కోట్లకు పైగానే ఉంటుంది. గృహ ఆదాయం, హోదా ఆధారంగా బంగారం నిల్వలను అంచనా వేస్తారు.
ఒకవేళ మీకు మీ పూర్వీకులు లేదా తాతల నుండి బంగారం వచ్చినట్లయితే దానికి సరైన వీలునామా లేదా పత్రాలు ఉంటే ఈ పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని కూడా ఉంచుకోవచ్చు.
ఈ పరిమితులు కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. బంగారు బిస్కెట్లు, కాయిన్స్ వంటి వాటికి తప్పనిసరిగా కొన్నట్లు ఆధారాలు ఉండాలి. మీ కుటుంబ సభ్యులు కాని వారి ఆభరణాలు సోదాల సమయంలో దొరికితే పన్ను అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు.
ఒకవేళ పరిమితికి మించి బంగారం ఉంటే.. దానికి సరైన ఆధారాలు చూపించలేకపోతే ఆ బంగారం విలువలో 60% వరకు పన్ను, దానితో పాటు అదనపు జరిమానాలు పడే అవకాశం ఉంది. అందుకే మీరు కొనే ప్రతి గ్రాము బంగారం బిల్లులు భద్రపరచుకోవడం మంచిది. ఒకవేళ బిల్లులు లేకపోయినా పైన చెప్పిన పరిమితిలోపు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు.
ఒక వ్యక్తి ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు, దానికి ఎటువంటి పరిమితి లేదు. కాకపోతే ఆ బంగారం ఎక్కడిది, ఎలా వచ్చిందో తగిన ఆధారాలు ఉండాలి. మీరు నగలు కాకుండా కేవలం పెట్టుబడి కోసం భారీగా బంగారం నిల్వ చేస్తే ఈ సడలింపులు ఉండవు లేదా మీ దగ్గర ఎక్కువ మొత్తంలో గోల్డ్ బిస్కెట్లు, నాణేలు లేదా గోల్డ్ బార్లు ఉంటే.. ఖచ్చితంగా వాటికి సంబంధించి కొన్నట్లు బిల్లులు ఆధారాలు ఉండాలి.
