- మార్చి 15 వరకు కొనుగోళ్లు జరుగుతయ్
- ఎంపీ వంశీకృష్ణ హామీ
కోటపల్లి, వెలుగు: పత్తి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ సూచించారు. ఈ నెల 20 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు సీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రకటన విడుదల చేసి భరోసా ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా పత్తి అమ్మకాల విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, పత్తి కొనుగోలు తేదీని పొడిగించాలన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఈ సమస్యపై సీసీఐ సీఎండీతో మాట్లాడానని, ఫిబ్రవరి 20న పత్తి కొనుగోళ్లు నిలిపివేయొద్దని, మార్చి 15 వరకు కొనుగోళ్లు కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, సీసీఐ కొనుగోళ్లు సజావుగా సాగుతాయని భరోసా ఇచ్చారు.
