బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోతో పాపులర్ అయిన ఆయేషా ఖాన్.. ‘ఓం భీమ్ బుష్’, ‘మనమే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని స్పెషల్ సాంగ్‌తో తెలుగులో గుర్తింపును అందుకున్న ఆమెకు.. ఇటీవల ‘ధురందర్’ చిత్రంలో చేసిన షరారత్ సాంగ్ మరింతగా పాపులర్ చేసింది. దీంతో బాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘భాగమ్ భాగ్ 2’ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో నవ్వులు పంచిన ‘భాగమ్ భాగ్’ చిత్రానికి ఇది సీక్వెల్.
అప్పట్లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబో పండించిన కామెడీ ఎంతగానో అలరించింది. ఈ సినిమా ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ పేరుతో తెలుగులోనూ రీమేక్ అయింది. ఇరవై ఏళ్ల తర్వాత ఈ హిందీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అప్పట్లో ప్రియదర్శి తెరకెక్కించగా, ఇప్పుడు సీక్వెల్‌కు రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు.
గోవిందా పాత్రను మనోజ్ బాజ్‌పాయ్‌తో రీప్లేస్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక గ్లామర్ పరంగానే కాకుండా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఆయేషా ఖాన్ నటించబోతోందని సమాచారం.
