ఒకపక్క బైక్కు పెట్రోల్ కొడుతుంటే.. బంక్లో స్మోకింగ్.. వద్దురా అంటే ఏం చేశాడో చూడండి !

ఒకపక్క బైక్కు పెట్రోల్ కొడుతుంటే.. బంక్లో స్మోకింగ్.. వద్దురా అంటే ఏం చేశాడో చూడండి !

నువ్వేంట్రా నాకు చెప్పేది..? వచ్చాడయ్యో పెద్ద ఫుడింగు.. ఇవే కదా ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు  ఈ జనరేషన్ మాట్లాడే తెంపరితనంతో కూడిన మాటలు. మంచికి చెప్పినా.. నష్టపోతావని చెప్పినా.. నాకు నష్టం జరిగితే నీకేంట్రా అన్నట్లుగా ఉండేవాళ్లు ఎక్కువైపోయారు. కావాలి కచ్చకు అన్నట్లుగా వద్దన్న పని చేసి.. కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చుకునే పొగరుబోతులు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటోడే వీడు. పెట్రోల్ బంకులో సిగరెట్ కాల్చొద్దన్నందుకు ఏకంగా తగలబెట్టినంత పనిచేశాడు. వీడు చేసిన పనికి ఏకంగా బంక్ తో పాటు వీడూ పేలిపోయేవాడు. తృటిలో తప్పించుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్ రాయిపూర్ లో జరిగింది ఈ ఘటన. గురువారం (ఫిబ్రవరి 19) సాయంత్రం ఉర్ల ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ఓ ఆకతాయి.. సిగరెట్ తాగొద్దన్నందుకు ఏకంగా పెట్రోల్ నాజల్ నే అంటించేశాడు. దీంతో నాజల్ తో పాటు బైక్ ట్యాంక్ అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ధర్మేంద్ర క్షత్రి, ఇమ్రాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ కు వచ్చారు. ఇమ్రాన్ బైక్ పై కూర్చుని పెట్రోల్ కొట్టిస్తుండగా.. అదే సమయంలో కిందికి దిగిన ధర్మేంద్ర సిగరెట్ అంటించుకునే ప్రయత్నం చేశఆడు.  సిగరెట్ తాగవద్దని సిబ్బంది చెప్పడంతో చిర్రెత్తుకొచ్చినట్లు అసహనానికి గురైన ధర్మేంద్ర..  ఏకంగా పెట్రోల్ నాజల్ పైపును లైటర్ తో అంటించేశాడు.  దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

బైక్ పెట్రోల్ ట్యాంక్ తో పాటు.. ఫుయెల్ పైప్, మెషీన్ కు కూడా మంటలు అంటుకోవడం ఒక్కసారిగి భయాందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. పైప్ ను బైక్ ట్యాంక్ నుంచి లాగి.. పెట్రోల్ మెయిన్ సప్లైని ఆపేశాడు. ఆ తర్వాత వెంటనే ఫైర్ సేఫ్టీ కిట్ ను ఉపయోగించి.. మంటలను ఆర్పేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే బంక్ పేలిపోయే ప్రమాదం ఉండేదని పోలీసులు తెలిపారు. 

నాజల్ పైపు అంటుకున్న తర్వాత.. అందులోనించి పెట్రోల్ ఆ ఆకతాయిపైన చిమ్మింది. పెట్రోల్ మంటలతో ఆ ఆకతాయికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో పూర్తి విజువల్స్ చూడవచ్చు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.