పల్లెల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గర గంజాయి చాక్లెట్లు

పల్లెల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గర గంజాయి చాక్లెట్లు

గంజాయి.. ఇది జీవితాలను నాశనం చేస్తుంది. కొంత మంది దుర్మార్గులు.. తమ స్వార్థం కోసం.. డబ్బు కోసం చిన్న పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలపై దాడులతో.. కొత్త పంథాలో వ్యాపారం చేస్తున్నారు ఈ పనికి మాలిన వాళ్లు. గంజాయిని లిక్విడ్ గా మార్చి.. వాటిని చాక్లెట్లలో కలిపి.. గంజాయిని చాక్లెట్లుగా అమ్ముతున్నారు.. సిటీలో అయితే పట్టుబడతాం అనే ఉద్దేశంతో.. పల్లెలకు వెళుతున్నారు. గ్రామాల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గరలోని షాపులకు మామూలు చాకెట్లుగా.. ఆయా షాపులకు విక్రయిస్తున్నారు. 

వాటిని కొనుక్కుని తింటున్న పిల్లలు మత్తులోకి జారుకుంటున్నారు. చాక్లెట్ బాగుంది.. మత్తుగా ఉంది.. గమ్మత్తుగా ఉందనే ఫీలింగ్ లో.. పిల్లలు పదే పదే ఈ చాక్లెట్లను కొనుగోలు చేసి తింటారు. గంజాయి అని తెలియక అలవాటు పడిపోతున్న పిల్లలు.. ఆ తర్వాత ఆ గంజాయి చాక్లెట్లకు బానిసగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తూ వెళుతున్న ఈ గంజాయి చాక్లెట్ల నెట్ వర్క్ ను.. ముఠాను పట్టుకున్నారు పోలీసులు. విచారణలో ఈ కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు.  అవి తిన్నప్పటినుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ చాక్లెట్స్ తిన్నాక మత్తులోకి జారుకుంటున్నారు.  కొద్దిరోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో  తెలియక ఉపాధ్యాయులు ఆయోమయానికి గురయ్యారు. దీనిపై ఆరా తీయగా పాన్ షాపులో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది,

దీంతో వెంటనే పోలీసులకు టీచర్లు సమాచారం అందియగా SOT పోలీసులు ఆ పాన్ షాపుపై  దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.  పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మొదటగా విద్యార్థులు ఫ్రీగా ఈ చాక్లెట్లను పంచిపెట్టి వారికి గంజాయిని అలవాటుగా మార్చారు .   ఆ తరువాత వారు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ను  20 రూపాయలకు విక్రయించినట్లుగా తేలింది. నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.