
ఎలాంటి సంసిద్ధత లేకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చిందని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు . వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఈ మహమ్మారి నుండి బయటే పడే మార్గం చూపించలేదన్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం విపక్షాలతో సోనియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలోనే లాక్‌డౌన్ ప్రకటించారని, అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని చెప్పారు.
21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నాం కానీ, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేస్తూ.. వైరస్ నుండి బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందన్నారు.వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయని, టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈలోగా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని అన్నారు.
ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజి ఒక క్రూయల్ జోక్‌గా నిలిచిందని చెప్పారు సోనియా. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు.
సైక్లోన్ అంఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు సోనియా. నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని విపక్షాల సమావేశంలో తీర్మానం చేశారు.