పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్
  • పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో  సర్కార్ వెంచర్
  • రాష్ట్రంలోనే మొదటిసారి సిద్దిపేటలో లేఅవుట్  
  • 14 ఎకరాల్లో 111 ప్లాట్లు.. వచ్చే నెలలో వేలం.. భారీ ఆదాయమే టార్గెట్​గా ప్రచారం 

సిద్దిపేట, వెలుగు:  ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ, రాజీవ్​స్వగృహ భూములను మాత్రమే వేలం వేసిన సర్కార్.. ఇప్పుడు అసైన్డ్ భూముల వేలానికీ సిద్ధమైంది. రాష్ట్రంలోనే తొలిసారి సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే మోడల్ లేఅవుట్ రెడీ చేసింది. మొత్తం 14 ఎకరాల్లో 161 ప్లాట్లను సిద్దిపేట అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ (సుడా) సిద్ధం చేసింది. వీటిలో 50 ప్లాట్లు అసైనీలకు కేటాయించగా, మిగిలిన 111 ప్లాట్లు వేలం వేయనుంది. ఇందుకోసం బ్రోచర్లు ప్రింట్ చేయించి ముమ్మర ప్రచారం చేస్తోంది. తెలంగాణ వచ్చాక దళితులకు మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ దళితులకు భూములు ఇవ్వకపోగా, గత ప్రభుత్వాలు పేద దళితులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. ఇప్పటికే విలేజ్​పార్కులు, సెగ్రిగేషన్​ షెడ్లు, రైతు వేదికలు, శ్మశానవాటికల పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. అయితే అభివృద్ధి పనుల కోసం కావడంతో, దానిపై పెద్దగా వ్యతిరేకత రాలేదు.  ఇదే అదనుగా భావించిన సర్కార్.. ఇప్పుడు అసైన్డ్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం  మొదలుపెట్టింది. 

40 ఏండ్ల కింద పేదలకు పంపిణీ.. 

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద 14 ఎకరాల అసైన్డ్ భూమిలో సిద్దిపేట అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ వెంచర్ వేసింది. ఇందులో మొత్తం 161 ప్లాట్లు సిద్ధం చేయగా.. వాటిలో అసైనీలకు 50 ప్లాట్లు కేటాయించి, మిగిలిన 111 ప్లాట్లను ఓపెన్​యాక్షన్​ద్వారా అమ్మనుంది. ఈ భూములను 40 ఏండ్ల కింద 12 పేద దళిత కుటుంబాలకు కాంగ్రెస్​ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూములపై కన్నేసిన సుడా ఆఫీసర్లు అసైనీలను నయానోభయానో ఒప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో భూములు ఇచ్చేందుకు దళితులు ఒప్పుకోలేదు. దీంతో ఆఫీసర్లు వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ‘‘ఇవి అసైన్డ్​ భూములు. మీరు అమ్ముకోవడానికి, కొనడానికి అవకాశం ఉండదు. భూములు మాకు అప్పగిస్తే డెవలప్​చేసి, అందులోనే ఎకరాకు 600 గజాల ప్లాట్లు ఇస్తాం. వాటిని అమ్ముకొని లాభాలు పొందవచ్చు” అని అసైనీలకు చెప్పి 
సంతకాలు తీసుకున్నారు.

70 శాతం పనులు పూర్తి..

సుడా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న మిట్టపల్లి వెంచర్​లో అన్ని సౌలతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే భూములన్నింటినీ చదును చేసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీలు, వాటర్​ఫెసిలిటీ కల్పించారు. పార్క్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం  పనులు పూర్తి కాగా.. వచ్చే నెలలో ఓపెన్ యాక్షన్ ద్వారా ప్లాట్లను అమ్మడానికి సుడా ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.14 ఎకరాల్లో 68 వేల గజాల స్థలం అందుబాటులోకి రాగా.. అందులో రోడ్లు, డ్రైనేజీలు, పార్క్ లకు 30 వేల గజాలు కేటాయించారు. మిగిలిన 38 వేల గజాల్లో  161 ప్లాట్లు వేశారు. వీటిలో అసైనీలకు 50 పోగా, 111 ప్లాట్లను అమ్మనున్నారు. ఒక్కో ప్లాట్ కనిష్టంగా 150 గజాల నుంచి గరిష్టంగా 250 గజాల విస్తీర్ణంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గజానికి రూ.8 వేల కనిష్ట ధరగా నిర్ణయించారు. నిజానికి ఈ ఏరియాలో గజం రూ.25 వేల దాకా పలుకుతోంది. ఈ లెక్కన సర్కార్ ఊహించిన దానికంటే ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది.