
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్టుపై కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం అంటే వారు తప్పును ఒప్పుకున్నట్టేనని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం సీఎల్పీ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టక ముందే వాళ్లు హైకోర్టును ఆశ్రయిం చడం ఏంటి? ఎందుకంత భయం?’’అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తోం దని, ఆ నివేదికపై అసెంబ్లీ లో చర్చించాక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. కాళేశ్వరం కమిషన్ లేవనెత్తిన అంశాలపై కేసీఆర్, హరీశ్ సమాధానం చెప్పలేకనే కోర్టుకు వెళ్లారన్నారు. కమిషన్ రిపోర్టు తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని కేసీఆర్, హరీశ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి మేడిగడ్డ కూలిపోయినప్పుడే రాష్ట్ర పరువును బజారున పడేశారని, అప్పుడే వాళ్ల పరువు, ప్రతిష్టలు గోదావరిలో కలిసిపోయాయని విమర్శించారు.