తడిసిన ధాన్యం కొంటం.. రైతులెవరూ ఆందోళన పడొద్దు: పొన్నం

తడిసిన ధాన్యం కొంటం.. రైతులెవరూ ఆందోళన పడొద్దు: పొన్నం

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్/కరీంనగర్/హుస్నాబాద్, వెలుగు:  అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడానని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా మంగళవారం కరీంనగర్​లో కాంగ్రెస్ సభ రద్దు కావడంతో సభా వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఓటింగ్​తోనే బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. అందుకే ప్రధాని మోదీ రెచ్చగొట్టేలా దిగజారి మాట్లాడుతున్నరు.

తాళిబొట్టు అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్​కి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినయ్? దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే సంజయ్.. కరీంనగర్​లోని ఆలయాల కోసం ఏం చేశాడు?’’అని పొన్నం నిలదీశారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగితే సంజయ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. సంజయ్ లాంటి మూర్ఖుడు ప్రజాస్వామ్యానికి పనికి రాడని విమర్శించారు. పొన్నం వెంట కరీంనగర్ లోక్​సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

బీజేపీది నియంతృత్వ పాలన

దేశ సంపదను అంబానీ, అదానీలకు మోదీ పంచుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. తర్వాత కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్​ఎస్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. 

రైతు భరోసా అడ్డుకున్నరు

రైతులందరికీ రైతుభరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయని పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సోమవారం ఒక్కరోజే రూ.900 కోట్లు రైతుల ఖాతాలకు ట్రాన్స్​ఫర్ చేశామని పేర్కొన్నారు. రైతుభరోసా జమ చేయడం ఆపా లని ప్రతిపక్ష పార్టీలు ఈసీకి కంప్లైంట్ చేశాయని తెలిపారు. దీంతో రైతు భరోసా ఆగిపోయిందని చెప్పారు.