ప్రభుత్వ ఉద్యోగం వరమా.. శాపమా!

ప్రభుత్వ ఉద్యోగం వరమా.. శాపమా!

రైతు రుణమాఫీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలని ఆలోచన చేస్తున్న  ప్రభుత్వాలు నిజాయితీగా కొన్ని  ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.  అలాగే కేవలం ప్రభుత్వ ఉద్యోగి అని మాత్రమే కాకుండా మరి ఇంకా ఏ కారణం చేత పథకాలకు అనర్హత పొందుతున్నారో కూడా తెలుపవలసి ఉంటుంది. అది ఆర్థిక ప్రాతిపాదికనా లేక ఆస్తుల ప్రాతిపాదికనా లేక సమాజ ప్రాతిపదికనా అనేది వెల్లడించాలి. ఇతరుల కంటే  ప్రభుత్వ ఉద్యోగం వల్ల వారు పొందే ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు ఏమైనా ఉన్నాయా ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది.  ప్రజలలో చాలా అపోహలు ఉన్నట్లే  ప్రభుత్వంలో  కూడా ఉద్యోగుల మీద ఎన్నో అపోహలు ఉన్నట్లు ఉన్నాయి.  కానీ, వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే గత పది సంవత్సరాలలో ప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగాలలో సగం కంటే ఎక్కువ ఉద్యోగాలు 30-35 వేల కంటే తక్కువ జీతంలో ఉన్నాయి. 

జూనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌ లేదా అంతకంటే తక్కువ స్కేల్లో ఉన్న ఉద్యోగాలు మాత్రమే అధికంగా నింపడం జరిగింది.  కారుణ్య నియామకాలు, కొన్ని కాంట్రాక్టు పద్ధతులు తప్ప ఈ ఉద్యోగం కోసం రెండు మూడు సంవత్సరాలు కష్టపడి చదవాల్సిన పరిస్థితి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సొంత ఊరికి దూరంగా మరెక్కడో పనిచేయాల్సిన పరిస్థితి.  విద్య, వైద్య సదుపాయాల కోసం అంటూ పని ప్రదేశానికి దగ్గర గల పట్టణంలో ఇల్లును కిరాయికి తీసుకోవాలి. పనిచేసే చోటికి నిత్యం ప్రయాణం చేయాలి. ప్రజలు,  ప్రభుత్వాలు  అపోహ  పడుతున్నట్లు  లక్షల్లో జీతాలు తీసుకునేవారు మొత్తం ఉద్యోగులలో 20%లోపు మాత్రమే ఉన్నారు.

సగటు జీతాలతో వెతలు

ప్రభుత్వం  అధిక జీతం ప్రాతిపదికన కొంతమందిని పథకాలకు అనర్హులుగా చెప్పవచ్చు. కానీ, ఈ కొంతమందిని చూపి అందరినీ అదే గాటన కట్టడం న్యాయం అనిపించుకోదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అని చూస్తే ప్రజలందరితో  సమానంగానే టాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టాలి, హెల్త్‌‌‌‌‌‌‌‌ స్కీం పేరుతో ఇచ్చిన ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ కార్డు ఎక్కడా పెద్దగా ఉపయోగపడని పరిస్థితి. 

 కుటుంబంలో ఒక్కరికి అనారోగ్య సమస్య వస్తే అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు. 2004 తర్వాత  ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కూడా లేదు. ఉద్యోగుల హక్కులైన డీఏలు, పీఆర్సీలు సమయానికి ఏమైనా ఇస్తున్నారా అంటే సంవత్సరాల తరబడి లేటు. ఇన్ని చేశాక ప్రభుత్వం ఏమైనా వీరికి కూర్చోబెట్టి జీతం ఇస్తుందా అంటే  అదీ లేదు.  వారు చేసిన పనికి మాత్రమే  జీతం అందిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం లెక్కలోకి తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న టాప్‌‌‌‌‌‌‌‌ ప్రైవేటు కంపెనీలలో ఉన్న సగటు జీతంలో సగం కూడా కాదు.  పోనీ రాష్ట్రంలోని మిగతా ప్రజల కంటే అధికంగా ఏమైనా సంపాదిస్తున్నారా అంటే అది కూడా లేదు. తెలంగాణ ప్రజల సగటు తలసరి ఆదాయం 2023-–24 ఆర్థిక సంవత్సరానికి 3,43,297 రూపాయలు అని సగర్వంగా చెప్పుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 

అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం ఎంత, వారిపైన ఆధారపడ్డవాళ్ళు ఎంతమంది, అనుత్పాదక వయసులో ఉన్న తల్లిదండ్రులకు, పిల్లలకు మీరే ఆధారమైనప్పుడు వీరికి అందే జీతం ఏరకంగా తెలంగాణలోని ఇతరుల కంటే లేదా తెలంగాణ సగటు కంటే అధికమవుతుంది? అలాంటి వీరు ఏ విధంగా ఇతరుల కంటే ఆర్థికంగా బలిష్టంగా ఉన్నవారు అవుతారు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది.

సంపన్నులు అర్హులు, ఉద్యోగులు అనర్హులా?

నిజంగా ఆదాయం అధికంగా ఉండి ఇన్​కమ్‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టేవారిని కూడా అర్హులుగా చేస్తూ, కనీసం ఇన్​కమ్‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టే ఆదాయం కూడా లేనివారు ఏ విధంగా ఆర్థికంగా అనర్హులు అవుతారని ప్రభుత్వం  తీర్మానించిందో  తెలపాలి. కోట్లల్లో సంపాదిస్తున్న వ్యాపారస్తులు,  విదేశాలకు వెళ్లినవాళ్ళు, మంచి ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవారు, వారసత్వంగా ఆస్తులను కలిగి ఉన్నవారు, ఇన్​కమ్‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌ లు కట్టేవారు వీరందరికి లేని అనర్హత  ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఉంటుంది అన్నది ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలి. ప్రభుత్వాలకి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సరైన న్యాయం చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ దానిని వాడుకోవడం చేతగాక,  సంప్రదాయ మూస పద్ధతులను అనుసరిస్తూ తేలికైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే బలి చేయడం సమంజసం కాదు.

వాస్తవవాలను పరిగణనలోకి  తీసుకోవాలి

సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని అన్నివర్గాల ఆస్తులని, వారి నిజమైన ఆదాయాలని లెక్కకట్టి వారితో ప్రభుత్వ ఉద్యోగులను పోల్చిచూడాలి.  అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నట్లుగా అనుకోవచ్చు. కానీ, అనర్హులను అర్హులుగా చేస్తూ ప్రభుత్వంలో ఉన్న అటెండర్లు, డ్రైవర్లు తక్కువ జీతం పొందేవారు వీరందరినీ కూడా లక్షల్లో,  కోట్లలో సంపాదించిన వారి కంటే ఆర్థికంగా బలవంతులని చూపిస్తూ అనర్హులుగా చేసే నిర్ణయం సరికాదు.  ప్రజా సంక్షేమ పథకాలకు కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారిని మాత్రమే దూరం చేయకుండా వారి  కుటుంబ సభ్యులను కూడా అనర్హులుగా చేస్తున్నారు.  

సొంతిల్లు కట్టుకోవడమే గగనం

ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఉన్న ధరలలో జీవితంలో ప్లాట్‌‌‌‌‌‌‌‌ కొని ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కూడా  కష్టం. ఈ పరిస్థితుల్లో  కూడా వీరు ఆర్థికంగా బలిష్టంగా ఉన్నవారు అవుతారా? ఇతర ప్రైవేటు ఉద్యోగులందరూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వెళ్లి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులలో  వారు  వ్యవసాయం చేసే పరిస్థితి ఎలాగూ లేదు.  మారుమూలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ గ్రామాలకు తరచుగా  వెళ్తూ పరోక్షంగా,  ప్రత్యక్షంగాను వ్యవసాయాన్ని చేయిస్తూ వ్యవసాయానికి దగ్గరగా ఉన్నారు. ఉద్యోగులలో  ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఇన్​కమ్‌‌‌‌‌‌‌‌ టాక్స్​ను ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసేవారే తప్ప అధిక ఆదాయం పొంది టాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టేవారు అతి  తక్కువ శాతం ఉన్నారు. 

క్షేత్రస్థాయిలో చూసి నిర్ణయించాలి

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉందన్న పేరుతో  ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నచోట్ల కేవలం ఒకరికి ఉద్యోగం ఉందన్న సాకు చూపి వారి తల్లిదండ్రులకు ఏ సంక్షేమ పథకం అందకుండా చేస్తున్నారు.  కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. కుటుంబంలో ఉన్న ఇతర సంతానం వారి తల్లిదండ్రులు నష్టపోయిన ఆర్థిక మొత్తాన్ని కూడా చెల్లించవలసిందిగా ఉద్యోగులతో  గొడవలు పెట్టుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. కావున, ఈ విషయంలో ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సంఘంతో క్షేత్రస్థాయి ఆర్థిక పరిస్థితులను పోల్చి చూసి నిజమైన అర్హులు, అనర్హులని గుర్తించి కొంత సమయం పట్టినా ఆర్థిక స్థితిలో కింద ఉన్నవారికి న్యాయం చేసే నిర్ణయం తీసుకోవాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 

- పి.అన్వేష్​రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి (వనపర్తి)