పట్టిచ్చిన నూనెలకు డిమాండ్​

పట్టిచ్చిన నూనెలకు డిమాండ్​
  •  ప్యూరిటీ కోసం మళ్లీ పాత బాట పడుతున్న జనం
  • ప్యాకెట్ నూనెలపై  క్రమంగా తగ్గుతున్న ఆసక్తి
  • ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటమే కారణం..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వంటనూనెల విషయంలో జనం మళ్లీ పాత బాటే పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రిఫైన్డ్ (శుద్ధి చేసిన) ఆయిల్స్‌‌‌‌పై ఇంట్రస్ట్ చూపిన వారంతా ఇప్పుడు కూల్ ప్రెస్ ఆయిల్ కు మారుతున్నారు. స్వచ్ఛమైన నూనెల కోసం కూల్‌‌‌‌ ప్రెసింగ్‌‌‌‌ మెషీన్లను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్‌‌‌‌లో దొరికే  వంట నూనెలకు ప్రత్యామ్నాయంగా సొంతంగా నూనె గింజలను కొని మిల్లింగ్‌‌‌‌ చేయించుకుంటున్నారు. 
పోషకాల కోసం..
స్వచ్ఛమైన ఆయిల్‌‌‌‌ అంటే రిఫైన్డ్ చేయనిదే.. కానీ రిఫైన్డ్ నూనెలు మార్కెట్‌‌‌‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత కాలం గానుగ పట్టిన నూనెల వాడకం కనుమరుగైంది. గతంలో నూనెల్లో వేరుశనగ వాడకం ఎక్కువగా ఉండేది. తర్వాత అది తగ్గి సన్‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ పై ఇంట్రస్ట్ పెరిగింది. ఆ తర్వాత రైస్‌‌‌‌ బ్రాన్‌‌‌‌ ఆయిల్‌‌‌‌, ఆలివ్‌‌‌‌ ఆయిల్‌‌‌‌, వెజిటెబుల్‌‌‌‌ ఆయిల్‌‌‌‌.. ఇలా ఒక్కో రకం ఆయిల్‌‌‌‌పై ప్రజల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే  పోషకాలతో కూడిన వంట నూనెల కోసం ప్రజలు తిరిగి సంప్రదాయ పద్ధతి వైపు మళ్లుతున్నారు. పల్లీలు, నువ్వులు, కుసుమలు, పొద్దుతిరుగుడు, ఆవాలు, కొబ్బరి, వెర్రి నువ్వులు తదితర ఆయిల్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ను అతిగా వేడి పుట్టకుండా కూల్‌‌‌‌ ప్రెసింగ్‌‌‌‌ మెషీన్లతో పట్టించుకుంటున్నారు. పాత తరం గానుగ తరహాలో ఉండే ఈ మెషీన్లు నుంచి వచ్చిన నూనెకు వాసన, జిగురు ఎక్కువగా ఉంటుంది. అయినా అందులో ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వాళ్లు ధర ఎక్కువైనా ఇలా పట్టిచ్చిన నూనెలు వాడుతున్నారు. 
ఆయిల్‌‌‌‌ ధరల్లో తేడా..
ఇక రెండున్నర కిలోల పల్లీలను కూల్ ప్రెస్ మెషీన్‌‌‌‌లో క్రష్‌‌‌‌ చేస్తే ఒక లీటరు నూనె వస్తుంది. ఒక లీటర్‌‌‌‌ నూనెను తీయడానికి రూ.25 చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన లీటరు పల్లీ నూనెకు రూ.300 నుంచి రూ.320 వరకు ఖర్చు అవుతుంది. సన్‌‌‌‌ఫ్లవర్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ పట్టిస్తే లీటర్‌‌‌‌ నూనె రూ.450 వరకు ఖర్చవుతుంది. ఇవి స్వచ్ఛంగా కళ్ల ముందే తీసి ఇస్తుండటంతో వినియోగదారులకు నమ్మకం పెరుగుతోంది. అయితే మార్కెట్‌‌‌‌లో దొరికే రిఫైన్డ్‌‌‌‌ ఆయిల్స్‌‌‌‌.. ఈ ధరలో సగానికే దొరకడమనేది మిలియన్‌‌‌‌ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది.
 అందుబాటులో కూల్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ మెషీన్లు..
పట్టిచ్చిన నూనెలకు డిమాండ్ పెరుగుతుండటంతో గ్రామాల్లో యువత కూడా కోయంబత్తూర్‌‌‌‌ నుంచి ఆయిల్‌‌‌‌ కూల్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ మెషీన్లు తెప్పించుకుంటున్నారు. తక్కువ సైజులో లక్షన్నర నుంచి రూ.5 లక్షల వరకు ఉండటంతో మిల్లుల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఆయిల్‌‌‌‌ మెషీన్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.
కళ్ల ముందే పట్టించుకుంటేనే బెస్ట్‌‌‌‌..
ఏ నూనె అయినా మన కళ్ల ముందు పట్టించు కుంటే నాణ్యమైనదనే భరోసా ఉంటుంది. చూడకుండా కొంటే దాని ప్యూరిటీ తెలియ దు. ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. మా దగ్గరకు వచ్చి కూల్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ పట్టిచ్చు కుంటున్నారు. ఖరీదు చూడకుండా నాణ్యత కోసం పల్లీలు, సన్‌‌‌‌ఫ్లవర్‌‌‌‌, నువ్వులు, ఇతర ఆయిల్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ తెచ్చుకుని పట్టించుకుని నూనెలు తీసుకుని వెళ్తున్నారు.                                                                                                                                              - ప్రసన్నారెడ్డి, కూల్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ మెషీన్‌‌‌‌ ఓనర్‌‌‌‌, హైదరాబాద్
సొంతంగా తయారు చేసుకుంటేనే ప్యూరిటీ
లీటరు రూ.330 నుంచి రూ.500 వరకు ఖర్చు చేసి పట్టిచ్చిన నూనెలు వాడుతున్నం. నెలనెలా మారుస్తూ వేరుశనగ, పొద్దు తిరుగుడు నూనెలను పట్టిస్తున్నం. వీటిని కొన్నాక మార్కెట్‌‌‌‌లో ఆయిల్‌‌‌‌ ప్యాకెట్లు తక్కువ ధరకు ఎలా వస్తున్నాయనే డౌట్‌‌‌‌ వస్తోంది. ప్యాకెట్ నూనెల్లో ఏ మాత్రం ప్యూరిటీ లేదని అర్థమైతోంది. 
                                                                                                                                                                                                  - ఏ.రాజేశ్వరి, ప్రైవేటు ఉద్యోగిని, హైదరాబాద్‌‌‌‌