రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్‌‌‌‌‌‌.. త్వరలో మరో 4వేలకుపైగా కొనుగోలు కేంద్రాల ఓపెన్

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్‌‌‌‌‌‌.. త్వరలో మరో 4వేలకుపైగా కొనుగోలు కేంద్రాల ఓపెన్
  • 3,864 సెంటర్లలో 1.45 లక్షల టన్నుల వడ్లు కొన్న సర్కారు
  •     రైతులకు రూ.18 కోట్లు 
  • ఖాతాల్లో జమ
  •     పది జిల్లాల్లో వేగంగా కొనుగోళ్లు..సెంటర్లకు పోటెత్తుతున్న వడ్లు 
  •     అన్ని జిల్లాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధం చేసిన సర్కారు
  •     త్వరలో మరో 4వేలకుపైగా కొనుగోలు కేంద్రాల ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కొనుగోలు సెంటర్లు, వ్యవసాయ మార్కెట్లకు వడ్లు పోటెత్తుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 8,342 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే 3,864 కేంద్రాలను ఓపెన్‌‌‌‌ చేసింది. ఇక్కడ కొనుగోళ్లు స్పీడందుకున్నాయి. ఆదివారం నాటికి 16,394 లక్షల మంది రైతుల నుంచి 1.45 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

ఇందులో 85 వేల టన్నుల సన్నవడ్లు ఉండగా.. 60 వేల టన్నులు దొడ్డురకం ఉన్నాయి.  కాగా, వడ్లు అమ్మిన రైతులకు రూ.18 కోట్లను   ఖాతాల్లో జమచేసింది. ఇందులో సన్నవడ్లకు ఇప్పటికే రూ.50 లక్షల దాకా రైతులకు అందించింది. నిరుడు ఇదే సమయానికి 2,763  టన్నుల కొనుగోళ్లు జరగ్గా, ఈసారి సెంటర్లు ప్రారంభించిన 25 రోజుల్లోనే  1.45లక్షల టన్నుల  కొనుగోళ్లు జరిగాయి.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. ఆకస్మిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైంది. టార్పాలిన్లు, డ్రైయర్స్‌‌‌‌, మాయిశ్చర్​మిషన్స్‌‌‌‌, గ్రెయిన్​కాలిపర్స్‌‌‌‌లతోపాటు కోట్లాది గన్నీ సంచులు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొనుగోళ్లను సివిల్​ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సీఎస్, ప్రిన్సిపల్​సెక్రటరీ, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేస్తున్నారు.  జనవరి  ప్రారంభం వరకు కొనుగోళ్లు జరుగుతాయని రైతులకు భరోసా కల్పిస్తున్నారు.  

రికార్డు స్థాయి దిగుబడికి తగ్గట్టుగా..

రాష్ట్రంలో గత రికార్డులను తిరగరాస్తూ ఈ వానాకాలం సీజన్​లో 67.88 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.   రికార్డు స్థాయిలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  రాష్ట్ర సర్కారు సివిల్​ సప్లయ్స్​ ద్వారా ఈ యేడు 80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కేంద్రం మాత్రం 53.73 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు మాత్రమే ఇప్పటివరకు అనుమతించగా..80 లక్షల టన్నులు కొనుగోళ్లు చేయాలని రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర సర్కారు రూ.22వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

పది జిల్లాల్లో వేగంగా..

రాష్ట్రంలో ముందస్తుగా వరి సాగైన జిల్లాల్లో పంట కోతలు పూర్తయ్యాయి. మరి కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పొలాలు కోతలకు వస్తున్నాయి. దీంతో పంట కోతలు పూర్తయిన  నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి, నల్గొండ, కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వేగంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ 10 జిల్లాల్లోనే సెంటర్లకు వడ్లు పోటెత్తుతుండగా.. అధికారులు ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నారు.