- తమకు కేటాయించిన గుర్తులతో నమూనా బ్యాలెట్,
- మేనిఫెస్టో ప్రింటింగ్ కోసం క్యాండిడేట్ల పరుగులు
- డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, కండువాలు...
- టోపీలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు
మహబూబ్‌నగర్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ప్రింటింగ్ ప్రెస్‌లకు గిరాకీ పెరిగింది. మొదటి విడత క్యాండిడేట్ల ఫైనల్ లిస్ట్, గుర్తులు రిలీజ్ కావడం, రెండో విడత నామినేషన్ల పరిశీలన జరుగుతుండడం, మూడో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగానే క్యాండిడేట్లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా మేనిఫెస్టోలు, పాంప్లెంట్లు, డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పాటు కండువాలు, టోపీలను సైతం బల్క్‌గా ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పటికే గుర్తులు ఫైనల్ అయిన క్యాండిడేట్లు తమకు కేటాయించిన సింబల్స్‌తో పాంప్లెంట్లను, వాల్, డోర్ స్టిక్టర్లను ముద్రిస్తున్నారు. గిరాకీ పెరగడంతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు తమ షాపులను నిరంతరాయంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏ ప్రింటింగ్ ప్రెస్ వద్ద చూసినా క్యాండిడేట్లు, వారి అనుచరుల హడావుడే కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మేనిఫెస్ట్‌ల రూపకల్పన
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ క్యాండిడేట్లు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. తమను గెలిపిస్తే ఏయే పనులు చేస్తామో, గ్రామాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో తెలపడంతో పాటు, వివిధ హామీలతో కరపత్రాలను ముద్రిస్తున్నారు. వందలాది కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ అతికించడమే కాకుండా గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు.
అంతటా ఒకటే రేటు
కరోనా కారణంగా ప్రింటింగ్ ప్రెస్‌లకు గిరాకీలు భారీగా పడిపోయాయి. ఫంక్షన్ల ఆహ్వానాలు సైతం ఫోన్ ద్వారానే పంపుతుండడంతో ప్రింటింగ్ వర్క్‌లు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కారణంగా కొంత మేరకు గిరాకీలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రేట్లను ఫిక్స్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల మధ్య కాంపిటీషన్ లేకుండా అందరూ ఒకే రేటు తీసుకోవాలని, బల్క్ ఆర్డర్‌కు అయితే 10 శాతం కంటే ఎక్కువ రాయితీ ఇవ్వొద్దని తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానాలను అన్ని జిల్లాల్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు పంపించారు.
ఈ క్రమంలో తక్కువ మొత్తంలో స్టాక్ తీసుకుంటే సాధారణ రేట్లు వసూలు చేస్తుండగా, బల్క్‌గా తీసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఏ4 సైజు డోర్ స్టిక్కర్ ఒకదానికి రూ.20 చొప్పున చార్జ్ చేస్తున్నారు. అదే 1000 స్టిక్కర్లు ప్రింట్ చేయాలంటే రూ.15 చొప్పున తీసుకుంటున్నారు. అలాగే పేపర్ సైజ్‌ను బట్టి ఒక్కో విధంగా ధర వసూలు చేస్తున్నారు. ఒక టోకి రూ. 40, బ్యాడ్జీకి రూ.4, ఒక కండువా రూ.30, ఒక ప్లాస్టిక్ బ్యాడ్జ్ రూ.10, జెండా రూ.25, ఒక టీషర్టుకు రూ.200, కీ చైన్‌కు రూ.10 చొప్పు ధర నిర్ణయించారు. పెద్ద మొత్తంలో తీసుకుంటే వీటిలో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు.
కంటిన్యూగా పనిచేస్తున్నం
ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్‌లకు చాలా రోజులుగా గిరాకీ లేదు. కరోనా తర్వాత మార్కెట్ చాలా డల్ అయింది. ఇప్పుడు సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు రావడంతో వ్యాపారం కాస్త పుంజుకుంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాం. ఎన్నికల కారణంగా ఈ నెల మొత్తం బిజీగా ఉంటుంది. పోటీతత్వంతో ఎవరూ నష్టపోకుండా అసోసియేషన్ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సామగ్రిని అమ్ముతున్నాం.
– యాదయ్య మైత్రి ఆఫ్ సెట్ ప్రింటర్స్, మహబూబ్‌నగర్–
