సామాన్యుల ఇండ్లను కూలగొట్టారు కానీ...

 సామాన్యుల ఇండ్లను కూలగొట్టారు కానీ...
  • లీడర్ల ఇండ్లను నామమాత్రంగా పడగొట్టారంటున్న కీసర బాధితులు

మేడ్చల్ జిల్లా: కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ఐదు రోజుల ముందే నోటీసు ఇచ్చి ఇవాళ జేసీబీలను తీసుకొచ్చి కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎంపిఓ మంగతయారు మాట్లాడుతూ గ్రామంలో 25 అక్రమ ఇండ్ల నిర్మాణాలను కీసర పంచాయతీ కార్యదర్శి సునీత గుర్తించి తెలియజేస్తే.. ఐదు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ గ్రామంలో నాలుగు బృందాలుగా ఏర్పడి 25 అక్రమ ఇండ్లను జేసీబీల సహాయంతో కూల్చివేశామని చెప్పారు. 


అధికారులు తమ ఇండ్లను కూల్చి వేయడంపై కొందరు ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా డబ్భులు ఖర్చు చేశామని.. అయినా తమ ఇండ్లను కూల్చడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్ల నిర్మాణాల గురించి ఇప్పటికే విజిలెన్సు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. పంచాయతీ అధికారులు సామాన్యుల ఇండ్లను కూల్చేశారు కానీ.. పలుకుబడి ఉన్న వారి ఇండ్లను నామ మాత్రంగా కూల్చేశారని ఆరోపించారు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేత తప్పదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి నుంచైనా ఇల్లు కట్టుకునే వారు సక్రమంగా పంచాయతీ నుండి అన్ని అనుమతులు తీసుకొని ఇళ్లు కట్టుకోవాలని సూచించారు.