గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారుల నిర్వాకం

గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారుల నిర్వాకం
  • రైతు ఆత్మహత్యాయత్నం
  • గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారుల నిర్వాకం
  • మనస్తాపంతో బ్యాంక్ ముందు పురుగుల మందు తాగిన రైతు
  • మెదక్ జిల్లా చేగుంటలో ఘటన

మెదక్ (చేగుంట), వెలుగు : తల్లి క్రాప్ లోన్ బాకీ ఉందని చెప్పి.. కొడుక్కి సంబంధించిన వడ్ల పైసలను బ్యాంకు ఆఫీసర్లు తీసుకోనివ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాధిత రైతు.. బ్యాంకు ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శనివారం జరిగిందీ ఘటన. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన రైతు నీల రాములు.. యాసంగిలో కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మాడు. ఇందుకు సంబంధించిన రూ. 94 వేలు అతని బ్యాంక్ అకౌంట్‌‌‌‌లో జమయ్యాయి. ఆ పైసలు డ్రా చేసుకునేందుకు చేగుంటలోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్లాడు. అయితే అతని తల్లి నీల పెంటమ్మ పేరు మీద క్రాప్ లోన్ బాకీ ఉందంటూ వడ్ల డబ్బును బ్యాంకు ఆఫీసర్లు డ్రా చేసుకోనివ్వలేదు. పెంటమ్మ 2017లో రూ. 66 వేల క్రాప్ లోన్ తీసుకోగా, వడ్డీతో కలిపి రూ. 1.45 లక్షలు అయిందని, ఆ మొత్తం కట్టించాలని బ్యాంక్ ఆఫీసర్లు అతనికి చెప్పారు.

తాను ఎలాంటి బాకీ లేకున్నా, తనకు సంబంధం లేని లోన్ కట్టించాలని చెప్పడం, తన వడ్ల పైసలు డ్రా చేసుకోనివ్వకపోవడంతో రాములు ఆవేదనకు గురయ్యాడు. చాలా రోజులుగా ఆఫీసర్లు అదే మాట చెప్తుండటంతో విసిగిపోయాడు. శనివారం మరోసారి బ్యాంక్‌‌‌‌కు వెళ్తే డబ్బులు డ్రా చేసుకునేందుకు ఆఫీసర్లు నిరాకరించారు. దీంతో రాములు బ్యాంక్ అధికారుల తీరును నిరసిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల ముందు తాగాడు.అక్కడున్న వారు గమనించి వెంటనే రాములును చేగుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి బ్యాంక్ వద్దకు చేరుకున్న రాములు కుటుంబ సభ్యులు బ్యాంక్ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట ఎస్సై ప్రకాశ్‌‌‌‌ గౌడ్ అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి పంపించారు.