- చీఫ్ గెస్టుగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- వివరాలు వెల్లడించిన క్షత్రియ సేవా సమితి
ఖైరతాబాద్, వెలుగు: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు వేడుకలను ఈ నెల 4న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి తెలిపింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు వి. వెంకటేశ్వరరాజు, ట్రెజరర్ పి. వెంకటేశ్వర రాజు మాట్లాడారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గతేడాది ఏపీలోని భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఏడాది పాటు సీతారామరాజు జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని వారు తెలిపారు. అల్లూరి స్ఫూర్తితో ప్రాణాలను త్యాగం చేసిన గిరిజన కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ తమిళిసై, తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
