
చోళ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధానపాత్రలు పోషించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి. రెహమాన్ సంగీతం అందించారు. రెండు భాగాలుగా రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కిందటేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది. సెకెండ్ పార్ట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
బుధవారం చెన్నైలో ట్రైలర్‌తో పాటు ఆడియో లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. కమల్ హాసన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్‌తో పాటు ఖుష్బు, శోభన, రేవతి తదితర ఇతర సెలెబ్రిటీస్ పాల్గొన్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సముద్రంలో మునిగిన అరుళ్ మొళి (జయం రవి) చనిపోయాడనుకుని చోళ సామ్రాజ్యాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. మరోవైపు ఆదిత్య కరికాలుడిని చంపడానికి ప్లాన్ చేస్తుంటారు పాండ్యులు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.