రోమ్: గ్రాండ్ స్లామ్ టోర్నీల ఆదాయంలో క్రీడాకారులకు దక్కాల్సిన వాటా పెంపుపై అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదాయ వాటా పెంచని పక్షంలో టోర్నీలను బహిష్కరించడమే ఏకైక మార్గమని నంబర్ వన్ క్రీడాకారిణి ఆర్యనా సబలెంక అన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీ పంపిణీపై సబలెంక, పురుషుల నంబర్ వన్ జాన్నర్ సిన్నర్ సహా అగ్రశ్రేణి క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాము లేనిదే టోర్నీ లేదని, ప్రేక్షకులు ఇచ్చే వినోదానికి తామే కారణమని, కాబట్టి ఆదాయంలో ఎక్కువ శాతం వాటా పొందే అర్హత తమకు ఉందని సబలెంక పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాడటానికి బహిష్కరణే సరైన మార్గమని ఆమె తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు మొత్తం ప్రైజ్ మనీని 10 శాతం పెంచి 61.7 మిలియన్ యూరోలకు చేర్చారు.
టోర్నీ ఆదాయంలో క్రీడాకారులకు దక్కే వాటా 2024లో 15.5 శాతం ఉండగా, 2026లో అది 14.9 శాతానికి తగ్గుతుందని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇగా స్వైటెక్ స్పందిస్తూ, "బహిష్కరణ అనేది చాలా తీవ్రమైన నిర్ణయం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడం ముఖ్యం" అని అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలపై ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
