భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవను చేసి బాలబోగం నివేదించాక ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు. ముందుగా నిత్య కల్యాణం చేశారు. దీనిలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు.
అనంతరం శ్రీరామపట్టాభిషేకాన్ని పుష్యమి సందర్భంగా, శ్రీరామదీక్షాపరుల కోసం నిర్వహించారు. ముందుగా సమస్త నదీ, సముద్రజలాలను ఆవాహన చేసిన కలశంలోని జలాలతో వేదికను ప్రోక్షణ చేశారు. రామయ్యను విశేషంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పట్టాభిషేక వేడుక ప్రారంభమైంది. ఆస్థాన విద్వాంసుల కీర్తనల నడుమ శ్రీరామదాసు తయారు చేయించిన ఆభరణాలను శ్రీరామచంద్రమూర్తికి అలంకరణ చేశారు.
కత్తి, డాలు, గద, చామరాలు, రాజముద్రిక ఇలా వరుస క్రమంలో రామచక్రవర్తికి అలంకరించి చివరిగా కిరీటంను ధరింపజేసి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. సంప్రోక్షణ జలాలను రామచక్రవర్తితో పాటు భక్తులపై కూడా చల్లారు. అంతకుముందు గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం చేశారు. పంచామృతాలతో పాటు, నదీజలాలతో స్నపన తిరుమంజనం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు.
అభిషేకం అనంతరం నిమ్మకాయలు, తమలపాకులు, అప్పాల మాలలను నివేదించారు. హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. సాయంత్రం బేడా మండపంలో పట్టాభిరామునికి దర్బారు సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీతారామచంద్రస్వామి దేవస్థానం తరుపున 2026 సంవత్సరం క్యాలెండర్‌ను ఈవో దామోదర్‌రావు, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు రామం, అమరవాది విజయరాఘవన్ తదితరులు ఆవిష్కరించారు.
