
భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామికి గురువారం శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి ఉదయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి ముందుగా సీతారాముల కల్యాణం నిర్వహించారు.
విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించారు. కల్యాణం అనంతరం పట్టాభిషేకం వేడుకను ప్రారంభించారు. రామచంద్రమూర్తికి విశేష అలంకరణలు చేశారు. ముందుగా మండపాన్ని శుద్ధి చేశారు.
రామయ్యకు భక్తరామదాసు తయారు చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. కత్తి,డాలు, రాజదండం, చామరాలు వరుస క్రమంలో స్వామికి సమర్పించి చివరిగా బంగారు కిరీటాన్ని అలంకరించి, ప్రోక్షణ జలాలను స్వామిపై, తర్వాత భక్తులపై చల్లారు. ఈ వేడుకలను తిలకించి భక్తులు పులకించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
అన్నదానానికి రూ.1.50లక్షలు విరాళం
భద్రాచలం సీతారామచంద్ర స్వామికి గురు వారం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు భక్తులు రూ.1.50లక్షలను విరాళంగా అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు గ్రామానికి చెందిన గారపాటి రామతులసమ్మ అనే భక్తురాలు రూ.1లక్ష, అదే గ్రామానికి చెందిన బొప్పాడి కాశీబాబు, శాంతారాణి దంపతులు రూ.50వేలు ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్ ద్వారా స్వామికి ఇచ్చారు.