భద్రాచలంలో జగదభి రాముడు.. వైకుంఠధాముడై..కన్నుల పండువగా ఉత్తరద్వారదర్శనం

భద్రాచలంలో జగదభి రాముడు.. వైకుంఠధాముడై..కన్నుల పండువగా ఉత్తరద్వారదర్శనం
  •    మహావిష్ణువు అవతారంలోసాక్షాత్కరించిన శ్రీరామచంద్రుడు
  • ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.. 

భద్రాచలం, నెట్​వర్క్, వెలుగు :  దక్షిణ అయోధ్య వైకుంఠ శోభతో పులకించింది. ఉత్తరద్వారంలో జగదభిరాముడే వైకుంఠంధాముడిగా దర్శనమిచ్చారు. స్వామిని దర్శించిన భక్తజనం తన్మయత్వంతో పరవశించారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించుకునే ఘడియల్లో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపారాధనల నడుమ జేగంటలు మోగుతుండగా సరిగ్గా మంగళవారం తెల్లవారుఝామున ఐదు గంటలకు భద్రాద్రి దేవస్థానం ఉత్తరద్వారం తెరుచుకోవడంతో జైశ్రీరామ్​ అంటూ నినదిస్తూ భక్తజనం గరుడ వాహనరూడుడైన శ్రీరాముని దర్శించుకున్నారు.

భక్తులకు దర్శనమిచ్చాక వైకుంఠరామునికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​, ఈవో దామోదర్​రావులు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రత విషయంలో ఎస్పీ రోహిత్​రాజ్​ తన సిబ్బందితో పర్యవేక్షణ చేశారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచే భక్తులు క్యూలైన్​ ద్వారా వెళ్లి మూలవరులను దర్శించుకున్నారు.

 వేడుకలకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు డుమ్మా కొట్టారు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, చీఫ్​ ఫెస్టివల్ ఆఫీసర్​ శ్రీనివాసరావు, కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​, ఎస్పీ రోహిత్​ రాజ్​, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాలరావు, పీవో రాహుల్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​, సబ్​ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ణ, ఈవో దామోదర్​రావు, జడ్జి శివనాయక్​ తదితరులు వైకుంఠరామున్ని దర్శించుకున్నారు. కాగా, జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.