యాదగిరిగుట్ట, వెలుగు:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ లో ఆంజనేయస్వామి మూలవిరాట్ ను పవిత్ర జలంతో శుద్ధి చేసిన అర్చకులు.. మన్యసూక్త పారాయణాలతో అభిషేకం చేశారు.
అనంతరం సింధూరంతో అలంకరించిన స్వామివారిని సుగంధ ద్రవ్యాలు కలిగిన రకరకాల పూలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేకంగా తెప్పించిన తమలపాకులతో హనుమంతుడికి నాగవల్లి దళార్చన నిర్వహించారు. అనంతరం అరటిపండ్లు, బెల్లం, వడపప్పు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
