
బెంగళూరు: రెండేళ్ల పిల్లాడని కూడా చూడకుండా సొంత అమ్మమ్మే వాడిని టార్చర్ చేసింది. నాన్న గురించి పదే పదే అడగడంతో మూతికి టేప్ వేసి మరీ చితక్కొట్టింది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. పిల్లాడి తల్లి హజీరా రోజు కూలీ. ఐదో డెలివరీ కోసం ఈ మధ్యే రెండేళ్ల పిల్లాడితో దక్షిణ బెంగళూరులోని సుడ్డగుంటె పాల్యలోని పుట్టింటికి వచ్చింది. మిగతా ముగ్గురు పిల్లలను తండ్రి ఇర్ఫాద్ దగ్గరే ఉంచింది. అమ్మతో పాటు అమ్మమ్మ ఇంటికొచ్చిన రెండేళ్ల బాబు శుక్రవారం నాన్న కావాలని మారాం చేశాడు. పదే పదే నాన్న కావాలని అడగడంతో అమ్మమ్మ ముబ్బషిరాకు కోపం వచ్చింది. వాడిని ఎడాపెడా కొట్టడంతో పాటు క్యాండిల్‌తో కాల్చింది. ఆ బాధకు ఇంకా ఎక్కువగా ఏడుస్తుండడంతో పిల్లాడి మూతికి టేప్ వేసింది. ఆ దెబ్బలకు పిల్లాడు స్పృహ తప్పి పడిపోవడంతో కూతురితో అల్లుడికి ఫోన్ చేయించింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బాలుడి తండ్రి ఇర్ఫాద్.. వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కండ్లు, ఒంటిపై అక్కడక్కడా అయిన కాలిన గాయాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇర్ఫాద్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో బాబు తల్లి, అమ్మమ్మపై కేసు నమోదు చేశారు. అమ్మమ్మను శనివారం అరెస్టు చేశారు. 20 రోజుల కిందటే హజీరా ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. దీంతో ఆ పిల్లాడి బాగోగులకోసం తల్లిని అరెస్టు చేయలేదు.