భారత ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను నవంబర్ 21, 2025 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే మార్చిన కొత్త చట్టాల్లో ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ పొందేందుకు అర్హత కల్పించబడింది. అయితే పాత చట్టాల ప్రకారం దీనిని పొందటానికి ఉద్యోగి సదరు సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పని చేయాల్సి వచ్చేది. అంటే కొత్త చట్టాల కింద ఉద్యోగికి గ్రాట్యుటీ అర్హత సైతం తక్కువ కాలపరిమితితో లభించనుంది.
అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి..?
గ్రాట్యుటీ అంటే ఉద్యోగి సంస్థలో తన సేవలు అందించినందుకు అందించే మొత్తం. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం.. గ్రాట్యుటీని ప్రతి ఏడాది పని చేసినందుకు 15 రోజుల చొప్పున కంపెనీలు చెల్లించేవి. అయితే ప్రస్తుతం, ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు 1 సంవత్సర సేవ తర్వాత కూడా ఈ సొమ్మును పొందవచ్చు. ఈ లెక్కింపు సూత్రంలో ఎలాంటి మార్పులు చేయలేదు కంపెనీ.
ఉదాహరణకు ఒక ఉద్యోగి తాను మానేయటానికి ముందు చివరిగా రూ.50వేలు జీతంగా పొంతున్నట్లయితే అతను కంపెనీలో 7 ఏళ్లు పనిచేసి ఉంటే పాత చట్టం కింద ఎంత పొందుతారో చూద్దాం..
సూత్రం: (15X చివరి జీతం X సేవా కాలం)/26.
ఈ సూత్రం ప్రకారం (15X50,000X6)/26 అంటే మెుత్తంగా చివరికి రూ.లక్ష 73వేల 076 గ్రాట్యుటీగా అందుకుంటారు.
అలాగే ఒక ఉద్యోగి కొత్త చట్టాల కింద కేవలం కంపెనీలో ఒక ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం నుంచి మానేస్తే ఎంత వస్తుందో ఉదాహరణతో తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఉద్యోగి జీతం చివరిగా పొందింది రూ.50వేలుగా తీసుకుందాం.
సూత్రం ప్రకారం (15X50,000X1)/26 అంటే మెుత్తంగా చివరికి సదరు ఉద్యోగి రూ.28వేల 846 గ్రాట్యుటీ రూపంలో పొందుతారు. మెుత్తానికి కొత్త లేబర్ చట్టాల వల్ల గ్రాట్యుటీ లెక్కింపు వల్ల ఎలాంటి కొత్త లాభం లేదా నష్టం లేనప్పటికీ.. గతంలో మాదిరిగా 5 ఏళ్ల లోపు పనిచేసినప్పుడు ఆ ప్రయోజనాన్ని మిస్ అయ్యే అవకాశం మాత్రం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే కెరీర్ గ్రోత్ కోసం ఎక్కువగా ఉద్యోగాలు మారుతుండే వ్యక్తులకు ప్రయోజనకరమనే చెప్పుకోవచ్చు.
