ఆపదలో ఆదుకున్న మనిషి చనిపోతే.. సహాయం పొందిన వారే తిరిగి చూడని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. కానీ.. తిండి పెట్టిన వ్యక్తి పట్ల ఓ కొండెంగ ఎంతో ప్రేమను కనబరచిన వీడియో వైరల్ అవుతోంది. రోజూ తనకు ఆహారం పెట్టే వ్యక్తి చనిపోయిన విషయం తెలియక.. ఎప్పటిలాగే అతని ఇంటికి వచ్చింది కొండెంగ. కానీ.. అక్కడ విగతజీవిగా పడి ఉన్న అతడిని చూసి చలించిపోయింది.
చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా భయపడకుండా.. శవం దగ్గరకు వచ్చిన కొండెంగ.. అతడ్ని లేపే ప్రయత్నం చేసింది. నుదురుపై ముద్దు పెట్టి తన ప్రేమను చూపింది. శ్రీలంకలోని బట్టికలోవా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చూసిన ప్రతీ ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తోంది. 56ఏళ్ల పీతాంబరం రాజన్.. ఓ కొండెంగకు రోజూ ఆహారం పెట్టేవారు. అయితే రాజన్ అనారోగ్యంతో ఈ నెల 17న చనిపోయారు. రాజన్ శవం దగ్గర.. కొండెంగ చూపిన ప్రేమ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
