జీవితానుభవాల అక్షర సంతకం.. అనుభవాలను, ఆలోచనలను నెమరువేసే పుస్తకాలు

జీవితానుభవాల అక్షర సంతకం.. అనుభవాలను, ఆలోచనలను నెమరువేసే పుస్తకాలు

కొన్ని పుస్తకాలు చదివినంతసేపే మనతో ఉంటాయి. మరికొన్ని చదివాక కూడా చాలాసేపు మన ఆలోచనల్లో నిలిచి, మన అనుభవాల్ని నెమరువేసేలా చేస్తాయి. డా. ఎస్. రఘు గారి ‘జీవనలిపి’ పుస్తకం అచ్చం అలాంటిదే. కేవలం నాలుగు పాదాల్లో, ఇరవై నుంచి ఇరవై ఐదు అక్షరాల పరిధిలో జీవిత సత్యాలను, మానవ అనుభవాలను, సామాజిక అంశాలను కూడా వ్యక్తం చేయగలమనే సత్యాన్ని ఈ పుస్తకం రుజువు చేస్తుంది.

“నావీ నీవీ వెరసి మనవి”గా నిలిచిన ‘నానీ’ల ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. విస్తృతమైన భావాన్ని అత్యల్ప పదాల్లో హృదయానికి హత్తుకునేలా చెప్పడం నానీలకు ఉన్న అసలైన బలం. ఆ బలాన్ని సమకాలీన జీవితం, మానవ సంబంధాలు, హాస్యం, వ్యంగ్యం, తాత్వికతలతో సమన్వయపరిచి పాఠకుడి ముందుంచిన రచన జీవనలిపి.

పాఠకుణ్ణి తన భావప్రపంచంలోకి ఆహ్వానించే అరుదైన ఆకర్షణ జీవనలిపి సొంతం. ఒక్కో నానీ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతూ, ఒక్కో అనుభూతిని మేల్కొలుపుతూ, జీవితంలోని చిన్నచిన్న సంఘటనల వెనుక ఉన్న పెద్ద పెద్ద సత్యాలను సైతం గుర్తుచేస్తుంది. ఇది కేవలం నానీల సంకలనం కాదు, జీవితానుభవాలను సూక్ష్మాక్షరాల్లో లిఖించిన ఒక అనుభూతి ప్రపంచం. ఒకసారి మొదలుపెడితే చివరివరకు చదివిస్తుంది ఈ పుస్తకం.

ఈ పుస్తకంలోని నానీలు జీవితంలోని ఎన్నో కోణాలను స్పృశిస్తాయి. బాల్యమనస్తత్వాన్ని చమత్కారంగా ఆవిష్కరించిన ఈ నానీ ఇది.. దొంగ వర్షం/ బడికెళ్లాక కురుస్తుంది!/ దొంగ జ్వరం/ ఇంట్లోనే వస్తుంది! పాఠశాలకు అలవాటుపడుతున్న చిన్నారి మనస్తత్వాన్ని ఇంత సహజంగా, హాస్యరసంతో చిత్రించడం రచయిత పరిశీలనా శక్తికి నిదర్శనం. 

యవ్వనానుభూతులను, ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరించే నానీల్లో “ప్రేమికులు/ పాతబడిపోయారు/ ప్రేమలేఖల అవసరం/ మళ్లీ వచ్చింది!” అనేది ఈ డిజిటల్​ యుగంలో క్రమంగా కనుమరుగవుతోన్న ప్రేమలేఖల మాధుర్యాన్ని గుర్తుచేస్తుంది. అలాగే “జ్వరాన్ని / కొలవడానికి థర్మామీటరా/ నీ కరస్పర్శ/ చాలదూ!” అనే నానీ ప్రేమలోని సున్నితత్వాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ థర్మామీటర్ అనే వస్తువును ప్రేమస్పర్శతో పోల్చుతూ, అనురాగం ఎంతటి ఓదార్పుని అందించగలదో కవి తెలియజేశారు. 

సమాజంలో కొందరు నీతులు చెప్పడంలో ముందుంటారు గానీ వాటిని ఆచరణలో పెట్టడంలో మాత్రం వెనుకబడిపోతారు. అలాంటి వారి స్వభావాన్ని కవి “అతనిది మరీ విడ్డూరం!/ పుష్పవిలాపం వింటూ/ పూలు కోస్తుంటాడు” అనే నానీలో చక్కగా ఆవిష్కరించారు. కరుణశ్రీ రాసిన పుష్పవిలాపంలో పువ్వుల వేదనను హృద్యంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి కవిత్వం వింటూనే పూలను కోయడం అంటే భావాన్ని ఆస్వాదిస్తూ, అందులోని సందేశాన్ని పూర్తిగా విస్మరించడం అనే అర్థాన్ని సూచిస్తుంది. మాటల్లో సున్నితత్వం చూపిస్తూ చేతల్లో క్రూరత్వం ప్రదర్శించే మనస్తత్వాన్ని ఈ నానీ వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంది. 

నీతి శతకాలలో కనిపించే జీవనబోధనలను సరళంగా, ఆధునిక ప్రపంచానికి దగ్గరగా చెప్పే నానీలు కూడా జీవనలిపిలో కనిపిస్తాయి. “పాలలో/ నీళ్లు కలిపినంత ఈజీగా/ మాటల్లో/ విషం నింపుతున్నాం!” అనే నానీ అందుకు ఒక మంచి ఉదాహరణ. పాలలో నీళ్లు కలపడం ఎంత సులభమో, అలాగే మాటల్లో విషాన్ని నింపడం కూడా ఈ రోజుల్లో అంతే ఈజీగా మారిందనే భావాన్ని ఇందులో వ్యక్తం చేశారు. శారీరక గాయాలు కొంతకాలానికి మానిపోతాయి. కానీ మాటల వల్ల కలిగే మానసిక గాయాలు చాలాకాలం మనసులో మిగిలిపోతాయి. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంయమనం అవసరమనే నీతిని ఈ నానీ తెలియజేస్తుంది. 

మానవ జీవితాన్ని వివాహానికి పూర్వం, వివాహానంతరం అనే రెండు ప్రధాన దశలుగా విభజించి చూడొచ్చు. ఈ రెండు దశల మధ్య ఉన్న భావజీవిత, బాధ్యతా నిర్మాణ వ్యత్యాసాలను కవి “శుభలేఖలో/ ఏదో అచ్చుతప్పు/ సర్దుకుపోవడం/ అక్కడ్నుంచే మొదలు!” అనే నానీలో చమత్కారంగా ఆవిష్కరించారు. ఇక్కడ ‘శుభలేఖ’ కొత్త జీవనవ్యవస్థకు ప్రతీకగా నిలిస్తే, ‘అచ్చుతప్పు’ దాంపత్య జీవితంలో సహజంగా ఎదురయ్యే అసంపూర్ణతలు, అనుకోని విరుద్ధతలకు ప్రతీకగా నిలుస్తుంది. 

‘సర్దుకుపోవడం’ అనే పదం దాంపత్య జీవన సారాన్ని ప్రతిబింబిస్తూ, రెండు భిన్న వ్యక్తిత్వాల మధ్య పరస్పర అవగాహన, రాజీ, అనుకూలన అవసరాన్ని సూచిస్తుంది. ఇలా వ్యంగ్యధ్వనితో కూడిన జీవనసత్యాన్ని ప్రతిపాదిస్తూ, వివాహం అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, బాధ్యతలతో కూడిన జీవనారంభమని తెలియజేస్తుంది. సంక్షిప్తతలో విశాలార్థాన్ని, సరళతలో గంభీరతను, చమత్కారంలో జీవనతాత్త్వికతను ప్రతిఫలింపజేయడం ఈ నానీ ప్రత్యేకత.

ఈ విధంగా ‘జీవనలిపి’లోని ప్రతి నానీ ఒక అనుభవపు చిరుకాంతి. పుస్తకాలకు/ రెక్కలుండవు/ చదివితే/మనకు పుట్టుకొస్తాయి అని రచయిత చెప్పినట్టు చదివితే తప్ప రెక్కలు పుట్టవు. ఒక్కసారి చదవడం మొదలు పెడితే అలా నానీల ఆకాశంలో ఎగురుతూ వెళ్లిపోతాం..!

సామాజిక వాస్తవికతను, ముఖ్యంగా పేదరికపు అంతర్మథనాన్ని ఆవిష్కరించే నానీలకు కూడా ఈ సంకలనంలో ప్రత్యేక స్థానం ఉంది. “దారిద్ర్యం కూడా/ ఒక ఆల్కేమీ/ దాని రహస్యం/ ఒక్క పేదవాడికే తెలుసు!” అనే నానీ అందుకు చక్కని ఉదాహరణ. తిలక్ ప్రసిద్ధ వాక్యమైన “కవిత్వం ఒక ఆల్కేమీ, దాని రహస్యం కవికే తెలుసు” అనే భావాన్ని సృజనాత్మకంగా పునర్వ్యాఖ్యానిస్తూ, దారిద్ర్యాన్నే ఒక గూఢ అనుభవంగా మలిచారు. 

ఇక్కడ ‘ఆల్కేమీ’ అనే ప్రతీక పేదరికంలోని అంతర్భావ సంక్లిష్టతను, దాని వెనుక దాగి ఉన్న బాధ, పోరాటం, ఆత్మనిగ్రహాన్ని సూచిస్తుంది. పేదరికం గురించి బాహ్యంగా ఎంత వివరణ ఇచ్చినా, దాని అసలు స్వరూపం అనుభవించినవారికే అవగతం అవుతుందనే జీవనసత్యాన్ని కవి ఎంతో హృద్యంగా వ్యక్తీకరించారు.

- మ్యాడం అభిలాష్,కంటెంట్ రైటర్ టిఎఎల్​ రేడియో-