బీజేపీ ఆఫీసుపై దాడి వెనక ఎవరున్నరు..?

బీజేపీ ఆఫీసుపై దాడి వెనక  ఎవరున్నరు..?

హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ పై గురువారం రాత్రి మజ్లిస్ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి నిందితులు ఎవరనేది తేల్చాలని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గుర్తు తెలియని ఓ గ్రూప్ బీజేపీ ఆఫీసుపై దాడికి ప్రయత్నించి, ప్రధాన గేట్ ను పాక్షికంగా ధ్వంసం చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం వారు పోలీసుల కస్టడీలోనే ఉన్నారన్నారు. వారు ఎవరు? వారి వెనక ఎవరున్నారనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని, తీవ్ర అభ్యంతరకరమని ఆయన ఖండించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్​పీఆర్ పేరు మీద దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించి రాజకీయంగా లబ్ధి  పొందాలని మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు అసదుద్దిన్, అక్బరుద్దీన్ ప్రయత్నిస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత దానిపై రాజకీయం చేయడం ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగ వ్యవస్థలో మంచిది కాదన్నారు. ఎంపీ హోదాలో ఉన్న అసద్ జనాభా లెక్కల సేకరణకు వచ్చే ఉద్యోగులకు సహకరించొద్దని పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముస్లింలు అంతా ఎన్పీఆర్ లో పేర్లను నమోదు చేసుకొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలని కోరారు.