ముసురు వానకే భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ దూరానికి గంట టైమ్

ముసురు వానకే భారీగా ట్రాఫిక్ జామ్..  కిలోమీటర్ దూరానికి గంట టైమ్
  • గ్రేటర్ సిటీలో ముసురు వానకే భారీగా ట్రాఫిక్ జామ్
  • రద్దీ ఏరియాల్లో ఎక్కడికక్కడే నిలిచిన వెహికల్స్

గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ను‌‌ వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానకు రోడ్లన్నీ కరాబయ్యాయి. వర్షం కారణంగా మంగళవారం ఉదయం సాధారణ రోజుల కంటే ఎక్కువ శాతం కార్లు రోడ్లపైకి వచ్చాయి. దీంతో ఉదయం నుంచే రద్దీ ఏరియాల్లో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌‌ అయ్యింది. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి వర్షంలోనే చిక్కుకున్నారు.
హైదరాబాద్‌‌, వెలుగు: ఓ వైపు వర్షపు నీరు.. మరో వైపు ట్రాఫిక్‌‌ కష్టాలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రద్దీ ఎక్కువగా ఉండే మెయిన్ రోడ్లపై వెహికల్స్‌‌ నెమ్మదిగా కదలడంతో కిలో మీటర్‌‌‌‌ దూరం జర్నీ చేసేందుకు గంట సమయం పట్టింది.

ఇసుక పేరుకుపోయి..

సోమవారం రాత్రి నుంచి ముసురు పడుతుండటంతో  రోడ్లపై ఇసుక పేరుకుపోయింది. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే మంగళవారం సిటీ రోడ్లపై బైక్​ల కంటే కార్లు, ఇతర వెహికల్స్ ఎక్కువగా కనిపించాయి.  కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల నుంచి మురుగు నీరు రోడ్లపైకి చేరింది. మరికొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో బైక్‌‌ లపై వెళ్లేవారు స్లోగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. దీంతో మెయిన్ రోడ్లలో మరింతగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గతంలో భారీ వర్షాలు పడినప్పుడే రోడ్లపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి. 

కానీ మంగళవారం ముసురు వానకే వాహనదారులు అవస్థలు పడ్డారు. బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, టొలిచౌకి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శివారు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మెహిదీపట్నం నుంచి టొలిచౌకి, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రూట్‌‌లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌‌ నిలిచిపోయింది. దీంతో నానక్‌‌రాంగూడ, నార్సింగి, లంగర్​హౌస్ మీదుగా ట్రాఫిక్​ను  డైవర్ట్‌‌ చేశారు. జూబ్లీహిల్స్‌‌,హైటెక్‌‌ సిటీ, రాయదుర్గం నుంచి వచ్చే వెహికల్స్​ను వివిధ మార్గాల్లో దారి మళ్లించారు.

ఐటీ కారిడార్‌‌‌‌లో ఎక్కడికక్కడే..

నిరంతరం వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్‌‌లోని మాదాపూర్‌‌, గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్‌‌, మియాపూర్‌‌ ప్రధాన చౌరస్తాలు, సిగ్నల్స్ వద్ద వెహికల్స్ బారులు తీరాయి. ఐటీ ఉద్యోగులు అంతా  కార్లలోనే అఫీసుకు బయలుదేరడంతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ మీదుగా ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్ వైపు, రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ వైపు, అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ జంక్షన్, జూబ్లీహిల్స్ నుంచి సైబర్ టవర్స్ వైపు, బొటానికల్ గార్డెన్ నుంచి  గచ్చిబౌలి, విప్రో జంక్షన్, ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కనిపించింది.  గచ్చిబౌలి– కొండాపూర్ రూట్​లో ట్రాఫిక్ డైవర్షన్ ఉండడంతో  వెహికల్స్ రద్దీ మరింత పెరిగింది.