కుక్కలు, కోతులతో బెంబేలు

కుక్కలు, కోతులతో బెంబేలు

మెహిదీపట్నంలోని అయోధ్యనగర్, దిల్షాన్​ నగర్​కాలనీలో కోతలు బెడద తీవ్రంగా ఉన్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లను ట్యాగ్​చేస్తూ గత నెలలో ట్వీట్ ​చేశారు.

హిమాయత్​నగర్​లోని జుడియో షోరూం పక్క కాలనీలో ఓ చెట్టు ఉందని, దాని మీదుగా డైలీ పక్కనే ఉన్న బిల్డింగ్​నాలుగో అంతస్తులోకి కోతులు వస్తున్నాయని సినీల్​ అనే సిటిజన్​ఇటీవల జీహెచ్ఎంసీని ట్యాగ్​చేస్తూ ట్వీట్​చేశాడు. ఆ చెట్టుని కట్ చేయడమో లేక కోతులు రాకుండా చర్యలు తీసుకోవడమో చేయాలని అందులో పేర్కొన్నాడు.

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​లో కోతులు, వీధి కుక్కల సమస్య ఎక్కువవుతోంది. చర్యలు తీసుకోవాలంటూ జనం జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కోతుల సమస్య కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ కుక్కల బెడద మాత్రం అన్ని చోట్లా ఉంది. డైలీ సిటీలో ఎక్కడో చోట దారిన పోయేవారిపై దాడులు చేస్తున్నాయి. టీకాలు తీసుకునేందుకు ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులకు డైలీ 200 మంది వరకు వస్తున్నారు. మరోవైపు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ వీధి కుక్కల పాపులేషన్ తగ్గడం లేదు. అలాగే కొన్నాళ్లుగా న్యూబోయిగూడ, మారేడ్​పల్లి, సికింద్రాబాద్, పద్మారావునగర్, సైదాబాద్, రాజేంద్రనగర్, మెహిదీప్నటం, హయత్​నగర్, దిల్​సుఖ్​నగర్, నాగోలు ఫతుల్లాగూడ, బీఎన్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో కోతులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల నుంచే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. రెండున్నరేండ్ల కిందట బల్దియా అధికారులు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రొఫెషనల్స్​ను పిలిపించి 311కోతులను పట్టించారు. వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ప్రస్తుతం కోతుల సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

వివరాల్లేవ్

గ్రేటర్ పరిధిలో ఎన్ని కోతులు ఉన్నాయనే వివరాలు జీహెచ్ఎంసీ అధికారుల వద్ద అందుబాటులో లేవు. పైగా ఎన్ని కోతుల ఉన్నాయని అడగగా లెక్కలు వేయలేమని కొందరు సమాధానం ఇస్తున్నారు. నాలుగేళ్లలో 650 కోతులను అడవిలో వదిలిపెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో 2018–19లో 186, 2019–20లో 311, 2020–21లో 90, 2021–22లో 63 కోతులను పట్టుకొని స్టెరిలైజేషన్ సర్జరీలు చేశామని, తర్వాత ఫారెస్ట్​ అధికారుల సమక్షంలో అడవుల్లో వదిలిపెట్టినట్లు అధికారులు వివరిస్తున్నారు. కానీ గ్రేటర్ పరిధిలోని కోతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కోతుల సంతతి పెరిగి మనుషులపై దాడులు చేయకముందే అధికారులు స్పందించాలని జనం కోరుతున్నారు. 

అన్ని సీజన్లలోనూ..

కుక్కల దాడుల్లో తరచూ ఎక్కడో చోట జనం గాయపడుతూనే ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఇటీవల తీవ్రగాయాల పాలై చిన్నారులు మృతి చెందారు. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలంటే స్టెరిలైజేషన్​చేయడం ఒక్కటే మార్గం. కుక్క కరిచినా దాని ద్వారా రేబిస్​ రాకుండా ఉండాలంటే వీధి కుక్కలన్నింటికీ వ్యాక్సిన్   వేయాల్సి ఉంటుంది. సిటిజన్ల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు బల్దియా వెటర్నరీ సిబ్బంది కుక్కలను పట్టుకొని వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ​చేసి వదిలిపెడుతున్నారు. చాలా ప్రాంతాల్లో 80 నుంచి 90 శాతం స్టెరిలైజేషన్ చేసి వదిలిపెట్టామని బల్దియా అధికారులు అంటున్నారు. సర్జరీలు చేసిన కుక్కలకి ఎడమ వైపు చెవుని కాస్త కట్ చేస్తారు. కొన్నింటికి కుడివైపు కూడా కట్ చేస్తారు.  కానీ చాలా కాలనీల్లోని కుక్కలకు ఇవి కనిపించడం లేదు. గ్రేటర్​లో 4 లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అనధికారికంగా ఆ సంఖ్య 5 లక్షలకుపైనే ఉంది. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోరి కుక్కలను పట్టుకెళ్లి ఫిర్యాదులు లేని ప్రాంతాల్లో వదిలేస్తుండటంతోనే వాటి సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 

హైకోర్టులో పిటిషన్స్

కోతుల బెడద భరించలేకపోతున్నామని  న్యూ బోయిగూడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రేగాని రేణుకతో పాటు మరో ఇద్దరు ఇటీవల హైకోర్టులో పిటిషన్ ​వేశారు. ఈ నెల 10న  చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్​తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషన్ దాఖలు చేసిన వారు కోతులను నిర్బంధించేందుకు మంకీ షెల్టర్లను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరారు. కోతులు రాకుండా ఇంటి కాంపౌండ్​లో గ్రిల్‌‌ ఏర్పాటు చేసుకోగా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించినట్లు పేర్కొన్నారు. ఆ విషయంపై పూర్తి విచారణ తర్వాత జీహెచ్‌‌ఎంసీ సిబ్బంది తీరు, చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్​జస్టిస్​ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.