పాత, కొత్త నేతల్లో.. కుదరని దోస్తీ

పాత, కొత్త నేతల్లో..  కుదరని దోస్తీ

గ్రేటర్​ టీఆర్​ఎస్​లో ముసలం పుట్టింది. పాత, కొత్త నేతల మధ్య దోస్తీ కుదరడం లేదు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి స్వరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తొలిసారి తలసానికి మంత్రిగా అవకాశం ఇచ్చినప్పటి నుంచే గ్రేటర్​ టీఆర్​ఎస్​ చీఫ్​గా ఉన్న మైనంపల్లి అసంతృప్తికి గురయ్యారు. రెండోసారి సర్కారులో తనకు చాన్స్​ వస్తుందనుకుంటే మళ్లీ తలసానికే మంత్రిపదవి​ కట్టబెట్టడంతో పార్టీ కార్యక్రమాలతోపాటు అధిష్టానానికి కూడా అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రిపదవి ఆశించి భంగపడ్డారు. అంతేకాకుండా నగరంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నామని కార్పొరేటర్లు కూడా అసహనంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు, సీనియర్లు, కార్పొరేటర్లు ఇలా ఒక్కొక్కరు పార్టీ తీరుతో విసిగిపోయి ఇతర పార్టీల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.