
హైదరాబాద్, వెలుగు: ఎండలు మండే కాలంలో చిరుజల్లులు హాయినిస్తాయి. ఆ జల్లులు వానైతే సంతోషిస్తాం. కానీ.. వానాకాలం వచ్చి, కుండపోత వానల్ని తలుచుకుంటే సిటిజన్లలో భయం కలుగుతూ ఉంటుంది. గత వానాకాలం వచ్చిన వరదలతో నిండా మునిగిన సిటీ వాసులు ఈ సారి వానాకాలం మరింత భయపడుతున్నారు. ఇటీవల అరగంట కురిసన చిన్నపాటి వానకే సిటీ రోడ్లు వరదమమయ్యాయి. ఇక.. రేపోమాపో మొదలయ్యే వరుస వానలను ఎలా తట్టుకోవాలో అని సిటిజనం ఆందోళన పడుతున్నారు. వానాకాలంలో పావుగంట ఆగకుండా కురిసిన వర్షానికే నగరం అతలాకుతలం అవుతుంది. ఇంక గంటలపాటు కురిస్తే ఎక్కడిక్కడ నీరు నిలిచిపోయి వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు నగరమంతా నీళ్లతో నిండిపోతుంది. గ్రేటర్లో వరదల ప్రభావంపై బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన సివిల్ ఇంజినీర్లు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా కిందటేడాది ఓ స్టడీ చేశారు. ‘అర్బన్ ఫ్లడ్ రిస్క్ అనాలసిస్ ఆఫ్ బిల్డింగ్స్ యూజింగ్ హెచ్‌ఈసీ–ఆర్ఏఎస్ 2డీ ఇన్ క్లైమెట్ ఛేంజ్ ఫ్రీమ్ వర్క్స్ ’ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వహించిన ఈ స్టడీలో సిటీ వరదల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలో 17 రోజుల పాటు 44.035 సెం.మీల వర్షం కురిసినా లేదా 19 రోజులపాటు 62.42సెం.మీల వాన పడినా దాదాపు సగం నగరం (334చదరపు కిలోమీటర్లు) మునిగిపోతుందని స్టడీలో పేర్కొన్నారు. వర్షాలు పడ్డప్పుడు నీరు ఇంకడానికి వీలులేకపోవడంవల్లే వరదలు వస్తున్నాయని నివేదికలో తెలిపారు. గ్రేటర్ పరిధిలో నీరు ఇంకడానికి వీలులేకుండా ఉన్న భూమి 1995 లో 55శాతం అయితే 2016కి 73 శాతానికి చేరింది. అది 2050నాటికి 85శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన ఎల్ బీనగర్, చార్మినార్, కూకట్ పల్లి, అల్వాల్ జోన్లలో సమస్య తీవ్రంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.
సిటీలో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి విపరీతంగా ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. అల్వాల్ కొత్తబస్తీ కమ్యూనిటీ హాల్ పరిధిలో అత్యధికంగా 2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్ లో అత్యల్పంగా 0.05 సెం.మీ వాన పడింది. రాబోయే 3 రోజుల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాలనీల్లోకి వరద నీరు..
వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన చిన్న వానకే కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి. అక్కడక్కడా ఇండ్లలోకి నీరు చేరుతోంది. భారీ వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని వారు ఆవేదన చెందుతున్నారు. 10 రోజుల కిందట 15 నిమిషాల వానతో షేక్ పేట్, టోలిచౌకి, ఎల్బీనగర్లోని అయ్యప్ప కాలనీ లాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనం ఇబ్బంది పడ్డారు. మల్లికార్జున నగర్, త్యాగరాయనగర్ కాలనీ, బండ్లగూడ, మెట్టుగూడ, ఎల్ బీనగర్, పెద్ద అంబర్ పేట, నాగోల్‌లోని అయ్యప్ప కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ, మీర్ పేటలోని మిథులానగర్, సత్యనారాయణ నగర్, చాంద్రయాణగుట్ట, ఉప్పల్, ఫలక్ నుమా లోని అల్ జుబైల్ కాలనీ, సయ్యద్ బాబా నగర్, టోలీచౌకి, నదీంకాలనీ, షేక్ పేట నాలా, అక్బర్ పురా కాలనీ, మహాత్మా గాంధీ నగర్ ఇలా వందల కాలనీలు, బస్తీలు వానంటే వణుకుతున్నాయి.
ఈ సీజన్లోనూ భారీ వర్షాలు
రాష్ట్రంతో పాటు సిటీలోనూ జూన్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో వానాకాలం మొదలవుతుంది. రాబోయే మూడురోజుల్లోనూ తేలికపాటి వానలు పడే అవకాశముంది. ఆలిండియా వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని భావిస్తున్నాం. భారీ వానలు కూడా కురిసే అవకాశం ఉంది.
- శ్రావణి, వాతావరణ శాఖ అధికారి