- పర్యాటకంలో అనుభవం ఉన్నవారికి సభ్యులుగా అవకాశం
- రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే బోర్డుదే తుది నిర్ణయం
- ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్.. కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకునే చాన్స్
హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పర్యాటక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సర్కారు.. త్వరలోనే ‘స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డు’ (ఎస్టీపీబీ) ను ఏర్పాటు చేయనుంది. రాయితీలు, ప్రోత్సాహకాలతో కొత్త పర్యాటక ప్రాజెక్టులను స్థాపించడం, వాటిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, పాలసీలోని కీలక నిర్ణయాలు అమలు చేయడం వంటివి చేసేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బోర్డుకు చైర్మన్ గా సీఎం రేవంత్‌రెడ్డి ఉంటారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరో ఇద్దరు మంత్రులు కమిటీలో ఉంటారు. టూరిజం రంగంలో అనుభవం ఉన్న 10 నుంచి 15 మందిని సభ్యులుగా తీసుకోనున్నారు. ప్రైవేట్ సెక్టార్ నిపుణులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇన్వెస్టర్లను సభ్యులుగా తీసుకునే చాన్స్ ఉంది. బోర్డుకు సలహాలు ఇచ్చి ప్రమోషన్ వ్యూహాలు రూపొందించనున్నారు.
బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే విధివిధానాలు ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను సీఎం ఆమోదం కోసం పంపించారు. ఆయన ఆమోదముద్ర వేస్తే బోర్డు అమల్లోకి వస్తుంది. దీనిపై సీఎం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర టూరిజానికి రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే వాటిపై తుది నిర్ణయం బోర్డు తీసుకుంటుంది. ఈ పెట్టుబడులను ఏ పర్యాటక ప్రాంతంలో పెట్టాలి, అక్కడ ఎలాంటి వనరులు కల్పించాలనే దానిపై పూర్తి నిర్ణయాధికారం బోర్డుకే ఉంటుంది.
టూరిజానికి మరింత బూస్ట్
రాష్ట్ర టూరిజం రంగాన్ని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఎస్టీపీబీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఎస్టీపీబీ ఇతర రాష్ట్రాల మోడల్‌ను అనుసరిస్తూ.. ప్రమోషన్, ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫోకస్ చేయనున్నది. ఇది త్వరలో అందుబాటులోకి వస్తే టూరిజానికి మరింత బూస్ట్ ఇవ్వనుంది. తెలంగాణను దేశంలోని టాప్-5 టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడం, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, ఫిల్మ్ ఇన్ తెలంగాణ అనే కార్యక్రమంతో ఫిల్మ్ టూరిజాన్ని ప్రోత్సహించనున్నారు. అలాగే, మెడికల్ టూరిజం జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
అనంతగిరి, నాగార్జునసాగర్, సోమశిల వంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్యాకేజీ టూర్లు నిర్వహించడం, హోటళ్లు, రిసార్ట్‌లు, బోటింగ్ తదితర అంశాలను పర్యవేక్షించడం వంటివి బోర్డు నిర్వహిస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా హైదరాబాద్‌కు వస్తుంటారు. దీంతో బిజినెజ్ టూరిజంలో హైదరాబాద్ ను నంబర్ వన్‌గా నిలిపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మెడికల్, కస్టమైజ్డ్, ఫిల్మ్, మైస్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. తొలి విడతలో మైస్ టూరిజంపై అధికారులు ఫోకస్ పెట్టారు.
బోర్డు మీటింగ్స్, ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ట్రిప్స్, జాతీయ, అంతర్జాతీయ సమ్మేళనాలు, వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఈవెంట్ నిర్వహణ, ప్రత్యేక క్యాటరింగ్ సేవలు వంటివి అందించేలా వీటిని రూపుదిద్దుతున్నారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఇతర కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేలా హైదరాబాద్ ను ‘ఈవెంట్స్ ఇండస్ట్రీ’ గా తీర్చిదిద్దనున్నారు. ఈ వేదిక ద్వారా ఈవెంట్ మేనేజ్‌మెంట్లలో ఈవెంట్ ప్లానర్లు, హోటళ్లు, క్యాటరింగ్ లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
