
హైదరాబాద్, వెలుగు: తీవ్రమైన నేరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వీగిపోకుండా ఇన్వెస్టిగేషన్ లోపాలపై గ్రేటర్ పోలీస్ బాస్‌లు ఫోకస్ పెట్టారు. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్‌పై 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసు సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్‌ను నిర్వహిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీతో కుట్ర, బంజారాహిల్స్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్ కేసుల దర్యాప్తులో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిందితులపై బలమైన సాక్ష్యాలు సేకరణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, డ్రగ్స్ తప్ప నిందితుల నుంచి సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. ఇలాంటి కేసుల్లో నిందితుల కాల్ డేటా పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్ ప్రాసిక్యూషన్ ఆధారాలుగా పోలీసులు కలెక్ట్ చేశారు. సక్సెస్ కేస్ స్టడీస్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.
టెక్నికల్ స్కిల్స్ పెంచుతూ...
కోర్టులో వీగిపోయిన తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను పరిశీలిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లోపాలను గుర్తించి టెక్నికల్ స్కిల్స్ పెంచుతున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లభించే ప్రతీ క్లూను సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు,నిందితుల కాల్‌డేటా,సీడీఆర్‌తో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్‌ఆధారంగా అసలైన నేరస్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం లీగల్ అడ్వయిజర్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌తో స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గరి నుంచి కోర్టు కానిస్టేబుల్, సాక్ష్యుల వరకు పాటించాల్సిన ప్రొసీజర్ గురించి వివరిస్తున్నారు.
గంజాయి, డ్రగ్స్ కేసుల్లో శిక్షలు..
డీఆర్‌ఐ దర్యాప్తు చేసిన రెండు గంజాయి కేసుల్లో నలుగురు నిందితులకు నెలరోజుల కిందట నాంపల్లి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గత రెండేళ్లలో నమోదు చేసిన ఎన్‌డీపీఎస్(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్ స్టాన్సెస్) యాక్ట్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. ఇలాంటి కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కోసం శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్(ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) రిపోర్ట్ ఆధారంగా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందుకోసం లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ను వాడుతున్నట్లు పోలీస్ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.