కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి  పనులు

హనుమకొండ, వెలుగు:గ్రేటర్​వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​లో డెవలెప్​మెంట్​ వర్క్స్ డెడ్​స్లోగా సాగుతున్నాయి. కొన్ని పనులు పేపర్ల దశలోనే ఉండిపోగా.. ఇంకొన్ని వర్క్స్  స్టార్ట్​ అయి మధ్యలోనే ఆగిపోయాయి. కాగా మరికొన్ని పనులు పునాదులు కూడా దాటని పరిస్థితి.. ఇందులో చాలా వాటికి ఫండ్స్​ కొరత కారణమని తెలుస్తుండగా.. ఇంకొన్నింటికి మాత్రం ఆఫీసర్ల నిర్లక్ష్యమే అడ్డంకిగా నిలుస్తోంది. దీంతో గత నెల 20న  జిల్లాకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కూడా గ్రేటర్ పరిధిలో జరుగుతున్న డెవలెప్ మెంట్​పనులపై హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశారు. పెండింగ్​ పనులతో పాటు డెడ్​ స్లోగా నడుస్తున్న వాటి గురించి ఆరా తీశారు. వెంటనే ఆయా వర్క్స్​ అన్నీ పూర్తి చేసేలా యాక్షన్​ తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని పనులకు డెడ్​ లైన్​ కూడా ఫిక్స్​ చేశారు. మంత్రి చెప్పి నెల దాటినా ఇంతవరకు ఏ ఒక్క పనిలో కూడా పురోగతి లేదు.  దీంతో జిల్లా లీడర్లు, ఆఫీసర్లు   మంత్రి కేటీఆర్ ఆదేశాలను లైట్​ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగితాల్లోనే మెట్రో నియో..

నగరంలో ట్రాఫిక్​ సమస్య పెరుగుతుండడంతో కొత్తగా కాకతీయ అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ (కుడా)  ఆధ్వర్యంలో మెట్రో నియో ప్రాజెక్ట్​కు రూపకల్పన చేశారు.  మహారాష్ట్రలోని  నాగపూర్​ మాదిరిగా మెట్రో నియోకు సంబంధించిన డీపీఆర్​ను ‘మహా మెట్రో’ సంస్థ తయారు చేసింది. ఈ మేరకు రూ.1,340 కోట్లతో కాజీపేట రైల్వే స్టేషన్​ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్​ వరకు మొత్తం 17 స్టేషన్లతో ఈ  ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించారు.  సిటీ జనాభా, రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్​ సమస్యలు తీర్చేందుకు మెట్రో నియో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని మంత్రి కేటీఆర్​ రెండేండ్ల నుంచి చెబుతూ వస్తున్నారు.  డీపీఆర్​ రెడీ అయిందని, సంబంధించిన పనులు స్టార్ట్​ అయ్యేలా చూడాలని గత నెల కూడా  ‘కుడా’ ఆఫీసర్లను ఆదేశించారు. కానీ ఫండ్స్​కొరతతో మెట్రో నియోకు సంబంధించిన వర్క్స్​ ఇంతవరకు పట్టాలెక్కలేదు. 

కాళన్న క్షేత్రానికి టార్గెట్​ జూన్​ ఫస్ట్.. 

2014 సెప్టెంబర్​ 9న సీఎం కేసీఆర్​కాళోజీ కళా క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో  క్షేత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ  ఫండ్స్​ కొరత కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తరువాత రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​, శ్రీనివాస్​ గౌడ్​, ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ బోయినపల్లి వినోద్​ కుమార్​, చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​, ఇతర లీడర్లు ఆ కళాక్షేత్రాన్ని విజిట్​ చేసి తొందర్లోనే   పూర్తి చేస్తామని చాలాసార్లు హామీలు ఇచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్​ కూడా చెప్పి జూన్​ 1 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ మలి దశ పనులు ఇంతవరకు స్టార్ట్ కాలేదు. దీంతో వచ్చే సెప్టెంబర్​ లో జరిగే కాళోజీ జయంతికి కూడా కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఓ వైపు లీకేజీలు.. మరోవైపు చెత్తాచెదారం

గ్రేటర్​ పరిధిలోని 66 డివిజన్లలో వాటర్​లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. మంత్రి కేటీఆర్​ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తరువాత గ్రేటర్​ ఆఫీసర్లు సిటీలో దాదాపు 700 లీకేజీలు గుర్తించారు. అందులో కొన్నింటిని రిపేర్​ చేసినా నీళ్లు రంగు మారి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా రెండు, మూడు రోజులకోసారి వాటర్ సప్లై చేస్తుండటంతో నగరవాసులు  ఇబ్బంది పడుతున్నారు. శానిటేషన్​ సమస్య కూడా తీవ్రంగా ఉంది. పబ్లిక్​ హెల్త్​ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా మంత్రి కేటీఆర్​ ఆదేశించిన అనేక పనులు నత్తనడకన సాగుతుండడంపై గ్రేటర్​ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇకనైనా అన్ని పనులు  స్పీడప్​ చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

పునాదుల్లో మార్కెట్లు.. మొదట్లోనే బయో మైనింగ్​

గ్రేటర్​ వరంగల్ కు ఒకే ఒక డంపింగ్​ యార్డు రాంపూర్​ వద్ద ఉండగా.. నిత్యం పోగవుతున్న చెత్తతో అది పూర్తిగా నిండిపోయింది. అందులో దాదాపు 4 లక్షల టన్నుల చెత్త  పేరుకుపోగా గ్రేటర్​ ఎలక్షన్లకు ముందు మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా బయో మైనింగ్ కు శ్రీకారం చుట్టారు. అందుకు స్మార్ట్ సిటీ ఫండ్స్​ రూ.36 కోట్లు కూడా కేటాయించారు. కానీ ఆఫీసర్ల పర్యవేక్షణ లేమితో ఇంతవరకు అందులో పావు వంతు వ్యర్థాలు కూడా క్లీన్ చేయలేదు. ఇప్పటివరకు  45 వేల టన్నుల చెత్త మాత్రమే లిఫ్ట్​చేశారు. గత డిసెంబర్​ లో ఈ  ప్రాజెక్ట్​ వర్క్స్​ స్టార్ట్​ కాగా.. ఏడాదిలో  పూర్తి చేయాలని టార్గెట్​ నిర్ధేశించారు. ఇప్పటికే ఆరు నెలలు దాటినా పావు మందం పనులు కూడా కాలేదు.  నగరంలో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల నిర్మాణం స్పీడప్​ చేయాలని మంత్రి కేటీఆర్​ ఆదేశించినప్పటికీ అవి ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. రాంనగర్​ జంక్షన్​ వద్ద రూ.4.5 కోట్ల ఫండ్ తో నిర్మించే  మార్కెట్​ఇప్పటికీ పునాది దశ దాటలేదు. వరంగల్ లక్ష్మీపురం లో రూ.24 కోట్లతో నిర్మించే మార్కెట్​కు  పునాది కూడా తీయలేదు. అమ్మవారిపేటలో 150 కేఎల్​ డీఎఫ్ఎస్​టీపీ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి.  దోబీ ఘాట్లు, డిజిటల్ డోర్​ నెంబర్ల ప్రక్రియ, వైకుంఠదామాల పనులు స్లోగా సాగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు