- సొంత ఆదాయం రూ.349 కోట్లు.. గ్రాంట్లు రూ.685 కోట్లు
- రూ.620 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్స్లతో సమకూరుతాయని అంచనా
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆశతో జీడబ్ల్యూఎంసీలో పెరిగిన లెక్కలు
- చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గుండు సుధారాణి పాలకవర్గం
వరంగల్/ వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2026_27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1,040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రవేశపెట్టిన బల్దియా ముసాయిదా చివరి బడ్జెట్ అంచనాలను పాలకవర్గ కౌన్సిల్ ఆమోదించింది. ఇందులో రూ.349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా రూ.685 కోట్ల 20 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని, మరో రూ.620 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో వస్తాయని అంచనా వేశారు.
గుండు సుధారాణి మేయర్‍గా పాలకవర్గం 2021 మేలో ఏర్పడగా, ఐదేండ్ల గడువు దగ్గరపడటంతో పాలనపరంగా ఇదే వారికి చివరి బడ్జెట్ అవనుంది. సమావేశంలో హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జీతాలు, శానిటేషన్, కరెంట్ బిల్లులకు రూ.205 కోట్లు..
గ్రేటర్ వరంగల్లో రూ.1,040 కోట్ల బడ్జెట్‍లో పన్నుల ద్వారా సొంత ఆదాయం రూ.349 కోట్ల 19 లక్షలు సమకూర్చేలా అంచనా వేయగా, అందులో సిబ్బంది జీతాలకు రూ.100 కోట్లు వెళ్లనున్నాయి. శానిటేషన్ నిర్వహణకు రూ.40 కోట్ల 75 లక్షల 50 వేలు, కరెంట్ బిల్లులకు రూ.29 కోట్ల 05 లక్షలు, లోన్ కిస్తీలకు రూ.20 లక్షలు, 10 శాతం గ్రీన్ బడ్జెట్ కోసం రూ.34 కోట్ల 91 లక్షల 88 వేలు కేటాయించారు.
విలీన గ్రామాల కోసం..
గ్రేటర్ వరంగల్ పరిధిలో విలీనమైన 42 గ్రామాల అభివృద్ధికి ఈసారి రూ.25 కోట్ల 43 లక్షలు కేటాయించారు. రోడ్ల అభివృద్ధికి రూ.12 కోట్ల 43 లక్షలు, డ్రైన్, కల్వర్టులు రూ.9 కోట్ల 75 లక్షలు, నీటి సరఫరా రూ.కోటీ 50 లక్షలు, ఇతర పనుల కోసం రూ.కోటీ 75 లక్షల బడ్జెట్ పెట్టారు.
రూ.349 కోట్ల సొంత ఆదాయం ఇలా..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో పన్నులు, పన్ను రహిత ఆదాయం రూపంలో రూ.349 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. ఇందులో ఆస్తి పన్ను రూ.112 కోట్ల 75 లక్షలు, స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.40 కోట్లతో కలిపి రూ.152 కోట్ల 75 లక్షలు వస్తాయన్నారు. పన్ను రహిత ఆదాయంలో అద్దెల ఆదాయం రూ.10 కోట్ల 10 లక్షల 75 వేలు, ప్రజారోగ్యం, పారిశుధ్యం రూ.23 కోట్ల 56 లక్షలు, టౌన్‍ప్లానింగ్ ద్వారా రూ.126 కోట్ల 50 లక్షలు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.36 కోట్ల 27 లక్షలతో కలిపి మొత్తంగా రూ.349 కోట్ల 18 లక్షల 75 వేలు రానున్నట్లు అంచనా బడ్జెట్ రూపొందించారు.
రూ.685 కోట్ల గ్రాంట్స్ ఇలా..
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి గ్రాంట్ల రూపంలో రూ.685 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రూ.175 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ ద్వారా రూ.260 కోట్ల 20 లక్షలు, పీపీపీ పద్ధతిలో రూ.250 కోట్లతో కలిపి మొత్తంగా రూ.685 కోట్ల 20 లక్షలు అంచనా వేశారు.
జీడబ్ల్యూఎంసీలో ఐదో అతిపెద్ద బడ్జెట్..
జీడబ్ల్యూఎంసీ ఏర్పాటు అనంతరం ఐదుసార్లు రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‍పెట్టారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వం 2017 _18లో రూ.1043 కోట్లు, 2018 _19లో రూ.1123.97 కోట్లు చూపింది. 2019 _ 20లో రూ.1431 కోట్లకు పెంచేశారు. ఈ అంచనాలు పేక మేడలా కూలడంతో 2020_21లో అప్పటి గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అనూహ్యంగా కేవలం రూ.305 కోట్లతో వాస్తవిక అంచనా బడ్జెట్‍కు పరిమితమయ్యారు.
2021_22లో గ్రేటర్ స్పెషల్ ఆఫీసర్‍గా వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు రూ.557.77 కోట్లతో బడ్జెట్ రూపొందించి, మళ్లీ రూ.570 కోట్ల 75 లక్షలతో సవరణ చేశారు. 2022_23 ఏడాదికి రూ.609 కోట్ల 47 లక్షలు, 2023_24లో రూ.612 కోట్ల 29 లక్షలు ఉండగా, 2024_25 కోసం ముందుగా రూ.650 కోట్ల 10 లక్షలు, ఆపై దానిని సవరించి రూ.776 కోట్ల 20 లక్షలకు పెంచారు. చివరగా 2025_26 కోసం రూ.1071 కోట్ల 48 లక్షలు ఉండగా, ఈసారి రూ.1,040 కోట్ల 58 లక్షలతో మరోసారి జంబో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సామాన్యులపై భారం పడని బడ్జెట్..
మేయర్ గుండు సుధారాణి
జీడబ్ల్యూఎంసీ 2026_2027 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ ద్వారా సామాన్యులపై ఎటువంటి భారం లేకుండా రూ.1,040 కోట్లతో రూపొందించాం. వాస్తవాలకు అనుకూలంగా అంచనా వేయడంతో కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. గ్రేటర్ వరంగల్‍ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‍రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
