- త్వరలోనే బాలసముద్రం మార్కెట్ లో బయో మిథనైజేషన్ ప్లాంట్
- సిటీలో ఐదుచోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
- మడికొండ డంప్ యార్డుకు చెత్త తగ్గింపే లక్ష్యంగా అడుగులు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో చెత్త శుద్ధీకరణ సవాల్ గా మారింది. ప్రతిరోజు వెలువడుతున్న చెత్త మడికొండ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోతుండగా, అక్కడికి చెత్త తరలింపు తగ్గించేందుకు గ్రేటర్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ కంపోస్టు ప్లాంట్లు ఏర్పాటు చేసి, చెత్తను ఎరువుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ మేరకు హనుమకొండ బాలసముద్రం మార్కెట్ లో బయో మిథనైజేషన్ ప్లాంట్ నెలకొల్పడంతో పాటు నగరంలో ఐదుచోట్ల బయో కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇవన్నీ వినియోగంలోకి వస్తే మడికొండ డంప్ యార్డుకు చెత్తను తరలించే అవకాశం తగ్గనుంది.
తడి చెత్త నుంచి ఎరువు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు, దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా, ప్రతిరోజు 450 నుంచి 500 టన్నుల చెత్త వెలువడుతోంది. ఇందులో సగానికిపైగా తడి చెత్త ఉంటుండగా, క్షేత్రస్థాయి సిబ్బంది తడి, పొడి చెత్తను కలిపే సేకరిస్తుండగా, వేస్ట్ మేనేజ్మెంట్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోనే మడికొండ డంప్ యార్డుకు చెత్త తరలింపును తగ్గించడంతో పాటు క్షేత్రస్థాయిలో వెలువడుతున్న తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా ఆఫీసర్లు ప్రణాళిక రూపొందించారు.
ఈ మేరకు గతంలో హనుమకొండ బాలసముద్రంలో ఏర్పాటు చేసిన బయో కంపోస్టు ప్లాంట్ ను వినియోగంలోకి తెచ్చారు. రెండు రోజుల కింద ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ యూనిట్ తోపాటు సిటీలో మరో ఐదు చోట్ల బయో కంపోస్టు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భీమారం వాటర్ ట్యాంక్, నయీంనగర్ ఓల్డ్ మార్కెట్, వరంగల్ వైపు దేశాయిపేట ఫిల్టర్ బెడ్, కీర్తి నగర్, పోతన నగర్ లో ఈ బయో కంపోస్టు యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.!
నగరంలో వెలువడుతున్న తడి చెత్తతో హనుమకొండ బాలసముద్రం మార్కెట్ లో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్లాంట్ నుంచి వెలువడే బయో గ్యాస్ ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాగా, బయో మిథనైజేషన్ ప్లాంట్ కు ప్రతిరోజు 100 టన్నుల వరకు తడి చెత్త అవసరం కాగా, తడి చెత్తను వేరుగా సేకరించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
డంప్ యార్డు సమస్యకు సొల్యూషన్..
మడికొండ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మడికొండ డంప్ యార్డును తరలించాలని అక్కడి ప్రజలు ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ ఆఫీసర్లు మడికొండ డంప్ యార్డు ప్రక్షాళనలో భాగంగా అక్కడికి చెత్తను తరలించడం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో వెలువడుతున్న చెత్తను ఎక్కడికక్కడే శుద్ధి చేయడంతో పాటు ఎరువుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
దీంతో మడికొండ డంప్ యార్డు సమస్యకు కూడా పరిష్కారం దొరికినట్టే అవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. బయో కంపోస్టు యూనిట్లతో సత్ఫలితాలు వస్తే మడికొండ, రాంపూర్ గ్రామస్తుల డిమాండ్ నెరవేరడంతోపాటు నగరాన్ని వేధిస్తున్న చెత్త సమస్యకు కూడా ఫుల్ స్టాప్ పడనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
