
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్ణణాల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలియజేశారు. పట్టణాల్లో చెట్ల పెంపకం కోసం గ్రీన్ బడ్జెట్ కింద రూ. 280 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘రాబోయే ఆరునెలల్లో వెజ్&నాన్ వెజ్ మార్కెట్లను కట్టబోతున్నాం. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో రాబోయే ఆరునెలల్లో వైకుంఠదామాలు నిర్మించబోతున్నాం. డంపింగ్ యార్డ్ లేని మున్సిపాలిటీ రాష్ట్రంలో లేదు. ఈ ఏడాది 783 కోట్లు పారిశుద్ధ్యం కోసం కేటాయించాం. చెన్నై-లాహుర్ లాంటి పట్టణాల్లో రైళ్ల ద్వారా మంచి నీళ్లను తరలిస్తున్నారు. కానీ తెలంగాణాలో ఆ సమస్య లేదు. TUFIDC సంస్థకు వెయ్యి కోట్లకుపైగా నిధులు కేటాయించాం. వీటిని పట్టణాల అభివృద్ధికి ఉపయోగిస్తాం. వరంగల్‌లో మెట్రో నియో కార్యక్రమం కోసం 150 కోట్లు కేటాయించాం. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 150 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాం. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. వరంగల్ కార్పొరేషన్ కోసం రూ. 250 కోట్లు, వరంగల్ మెట్రో నియో ప్రాజెక్ట్ కోసం రూ. 150 కోట్లు కేటాయించాం.
టీఎస్ బీ-పాస్ ద్వారా పేదలకు లంచాలిచ్చే బాధ తప్పింది. హైదరాబాద్ నగరానికి గడిచిన ఆరేళ్లలో 67,149 కోట్లు ఖర్చు చేశాం. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ నగరం నిలుస్తోంది. CRMP రోడ్ ప్రోగ్రాం కింద 1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్ ఇండ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కోకాపేట భూముల అమ్మకం ద్వారా రూ. 2500 కోట్లు సమకూరుతాయి. గతంలో కార్మికులు నాలుగైదు నెలలు జీతాలు లేక ధర్నాలు చేశారు. హైదరాబాద్ వరదల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాటలతో ఏకీభవిస్తాను. హైదరాబాద్ వరదల్లో చిక్కుకుంది అని కేంద్రానికి లేఖ రాస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్రం మనసు అంతా వేరే ఎక్కడో ఉంది కానీ హైదరాబాద్ వైపు లేదు, రావడం లేదు. ఎన్నికల తరువాత 69 కోట్ల రూపాయలు వరదల వల్ల నష్ట పోయిన వారికి పంపిణీ చేశాం. హైదరాబాద్ అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న నగరం. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చి నిధులు కేటాయించాలి. బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడికే పరుగులు పెడుతోంది. మెట్రో కోసం 17వేల కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తే.. కేంద్రం 1400 కోట్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు. దేశ అభివృద్ధిలో 5 శాతం జీడీపీని తెలంగాణ కేంద్రానికి కంట్రిబ్యూట్ చేస్తోంది. కరోనా వల్ల ఆర్థికమాంద్యం వచ్చినా పేదల కోసం ఉన్న పథకాలు ఒక్కటీ ఆగలేదు. హైదరాబాద్‌లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ జిల్లాలకు కూడా విస్తరిస్తాం. పరిశ్రమల స్థాపన వల్ల 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టుకున్నాం. కాంగ్రెస్ హయాంలో వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. వరంగల్‌లో రైల్ ఫ్యాక్టరీకి భూమిని కేటాయించినా.. అనుమతి ఇవ్వడానికి కేంద్రానికి మనసు రావడం లేదు. హైదరాబాద్‌లోనే కరోనా వ్యాక్సిన్ ఎక్కువగా తయారీ అవుతుంది. కానీ, దాని టెస్టింగ్ మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని అడిగినా కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు ఇక్కడ... బోర్డు మాత్రం తమిళనాడులో పెడతా అని కేంద్రం అంటోంది. ఐటీ హబ్ హైదరాబాద్‌కి మాత్రమే కాకుండా జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాం. ఐటీ రంగం దేశంలో 8 శాతం ఉంటే... తెలంగాణలో 15 శాతానికి పైగా ఉండి వేగంగా ముందుకు వెళ్తోంది. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులు దేశంలో కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. 19 వేల మంది జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అక్రెడిషన్ ఇచ్చింది. జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా’ అని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారు.