వస్తున్నయ్‌ గ్రీన్‌ క్రాకర్స్‌

వస్తున్నయ్‌ గ్రీన్‌ క్రాకర్స్‌

శివకాశి ఎకో ఫ్రెండ్లీ పటాకులు
తగ్గనున్న సౌండ్‌,
ఎయిర్‌ పొల్యూషన్‌ 

దీపావళి పండుగ దగ్గరకొస్తోందిగా. పటాకులు పేల్చేందుకు రెడీనా. ‘బాబోయ్‌‌.. పటాకులా!  చెవులు పగిలిపోతయ్‌‌, ముక్కు నాశనమైతది. తలనొప్పి వస్తది. ఎందుకీ లొల్లంతా’ అనుకుంటున్నరా. ఇప్పుడలాంటి ప్రాబ్లం తక్కువైపోతదట. ఎందుకంటే మార్కెట్‌‌లోకి గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ వస్తున్నాయట. దేశంలో క్రాకర్స్‌‌కు ఫేమస్‌‌ ప్లేసైన శివకాశిలో ఇప్పటికే అంతా రెడీ అయ్యాయట. ఇన్ని రోజులు కెమికల్స్‌‌తో పటాకులు తయారు చేసిన శివకాశీ కంపెనీలు సుప్రీం ఆదేశాలతో ఇప్పుడు గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ వైపు రూటు మార్చాయి. ఎకో ఫ్రెండ్లీ, తక్కువ సౌండ్‌‌ చేసే పటాకులను మనకోసం సిద్ధం చేశాయి.

1,000 పరిశ్రమలు.. 8 లక్షల మంది వర్కర్లు

దేశంలో క్రాకర్స్‌‌ హబ్‌‌ శివకాశి. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం నుంచే క్రాకర్స్‌‌ ఎక్కువగా సప్లై అవుతుంటాయి. చెన్నై నుంచి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టౌన్‌‌లోని 1,000 పటాకుల పరిశ్రమల్లో సుమారు 8 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఏడాదికి రూ. 6 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. అయితే దేశమంతా దీపావళి రోజు ఒకేసారి పటాకులు కాల్చడంతో పొల్యూషన్‌‌ ఎక్కువవుతోందని, అందుకే అలాంటి ప్రమాదకర క్రాకర్స్‌‌ను నిషేధిస్తున్నామని 2018 అక్టోబర్‌‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గ్రీన్‌‌ క్రాకర్స్‌‌నే అనుమతించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో పరిశ్రమలు ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌‌ తయారీపై దృష్టిపెట్టాయి. వాటి తయారీపై అక్కడి లేబర్‌‌కు గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ తయారీపై శిక్షణనిచ్చాయి.

 90 డెసిబల్స్‌‌కు తీసుకొస్తం

సుప్రీం తీర్పు తర్వాత 4 నెలల పాటు తయారీ ఆగిందని, కానీ తమిళనాడు సర్కారు సాయంతో పర్యావరణానికి మేలు చేసే పటాకుల తయారీపై ఇక్కడి వర్కర్లకు ట్రైనింగ్‌‌ ఇచ్చామని తమిళనాడు ఫైర్‌‌వర్క్‌‌ అండ్‌‌ అమెర్సెస్‌‌ మానుఫాక్చర్స్‌‌ అసోసియేషన్‌‌ (టీఎన్‌‌ఎఫ్‌‌ఏఎంఏ) తెలిపింది. గ్రీన్‌‌ క్రాకర్స్‌‌ తయారీలో కౌన్సిల్‌‌ ఫర్‌‌ సైంటిఫిక్‌‌ అండ్‌‌ ఇండస్ట్రియల్‌‌ రీసెర్చ్‌‌, నేషనల్‌‌ ఎన్విరాన్‌‌మెంటల్‌‌ ఇంజినీరింగ్‌‌ రీసెర్చ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ సాయం చేశాయంది. ఈ పటాకులు సుమారు 30 శాతం తక్కువగా పొల్యూటెంట్స్‌‌ను ఉత్పత్తి చేస్తాయని, సౌండ్‌‌ పొల్యూషన్‌‌ 160 డెసిబల్స్ నుంచి 125కు తగ్గుతుందని పేర్కొంది. ఇది 90 డెసిబల్స్‌‌ కన్నా ఎక్కువైనా మున్ముందు ఆ స్థాయికి తీసుకొస్తామంది. టైం తక్కువగా ఉండటంతో గ్రీన్‌‌ లోగో వేయలేకపోయామని, క్విక్‌‌ రెస్పాన్స్‌‌ కోడ్‌‌ కూడా లేదని, ఇవి లేకుండా అమ్మేందుకు కోర్టు తమకు అనుమతిస్తుందని ఆశిస్తున్నామంది. వచ్చే ఏడాది నుంచి క్యూఆర్‌‌, గ్రీన్‌‌ లోగోతో బాంబులు మార్కెట్‌‌లోకి వస్తాయని చెప్పింది.

బాంబుల వెరైటీలు తగ్గలె

కెమికల్స్‌‌ను తగ్గించినా బాంబుల వెరైటీల్లో పెద్దగా మార్పు లేదని టీఎన్‌‌ఎఫ్‌‌ఏఎంఏ అధ్యక్షుడు గణేశన్‌‌ చెప్పారు. పటాకుల్లో 40 వెరైటీలే సౌండ్‌‌ లిమిట్‌‌ను దాటాయన్నారు. సేఫ్టీ పద్ధతులు కచ్చితంగా పాటిస్తుండటం వల్ల ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. తమ లేబర్‌‌కు శిక్షణ ఇవ్వడంలో సీఎస్‌‌ఐర్‌‌, నీరి చేసిన సాయం మరువలేదన్నారు. నీరి ఇక్కడ ఓ టెస్ట్‌‌, రీసెర్చ్‌‌, ట్రైనింగ్‌‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ యేడాది మార్చిలో క్రాకర్స్‌‌ తయారీ స్టార్టయిందని, అయినా ఈ నెల 27న రాబోతున్న దీపావళి సీజన్‌‌కు ఇప్పటికే టపాసులు రెడీ అయ్యాయని వెల్లడించింది. అక్రమ క్రాకర్స్‌‌ యూనిట్లను మూసేయించి చైనీస్‌‌ పటాకులను దిగుమతి చేసుకోకుంటేనే తమ మార్క్‌‌ చూపించుకోగలమంది.