మహారాష్ట్రలో ‘గ్రీన్డ్రమ్' మర్డర్.. ప్రియుడిని చంపి డ్రమ్ములో కుక్కిన ప్రియురాలు

మహారాష్ట్రలో ‘గ్రీన్డ్రమ్' మర్డర్.. ప్రియుడిని చంపి డ్రమ్ములో కుక్కిన ప్రియురాలు

ముంబై: మహారాష్ట్రలోని ముంబ్రాలో ఓ మహిళ తన భర్త, సోదరుడితో కలిసి ప్రియుడిని హత్య చేసి గ్రీన్ డ్రమ్ములో కుక్కింది. గతంలో యూపీలోని మీరట్‌‌‌‌‌‌‌‌లో సంచలనం సృష్టించిన సౌరభ్ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్ 'బ్లూ డ్రమ్' హత్యను ఈ ఘటన గుర్తుచేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబ్రాకు చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ ఏప్రిల్ 3 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తండ్రి ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అర్బాజ్ కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్ హిస్టరీని పరిశీలించారు. 

అతడి చివరి లొకేషన్ వెర్సోవా ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో అతడి ప్రియురాలు మెహజబీన్ షేక్ లొకేషన్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు మెహజబీన్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో ఆమె వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ చివరకు హత్య చేసినట్లు ఒప్పుకుంది. 

మెహజబీన్, ఆమె భర్త హసన్, సోదరుడు తారిఖ్ షేక్ కలిసి అర్బాజ్​ను బ్లాక్​మెయిల్​చేసి డబ్బులు గుంజాలని చూశారు. ఇందుకోసం అతడిని వెర్సోవాకు పిలిపించారు. అర్బాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులు అతడిని కట్టేసి, ప్లాస్టిక్ పైపుతో దారుణంగా కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్​బాడీని ఓ గ్రీన్​డ్రమ్ములో కుక్కి దానిని ముంబ్రా ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో పడేశారు. శుక్రవారం పోలీసులు నిందితులు మెహజబీన్ షేక్, ఆమె సోదరుడు తారిఖ్ షేక్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు.