తిమ్మాపూర్​లో ప్లాట్లుగా మారుతున్న పచ్చని పొలాలు

తిమ్మాపూర్​లో ప్లాట్లుగా మారుతున్న పచ్చని పొలాలు
  • సుడా, జీపీ పర్మిషన్ లేకుండా విక్రయం
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు

తిమ్మాపూర్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్టర్లు వెంచర్లను ఏర్పాటు చేసి అమాయకులకు ప్లాట్లను అమ్ముతూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి ధరణి పోర్టల్‌‌ ద్వారా విక్రయిస్తుండడంతో ప్లాట్లు కొన్నవాళ్లు ఇండ్లు కట్టుకోవడానికి పంచాయతీ కార్యాలయాలను ఆశ్రయించినపుడు చిక్కులు ఎదురవుతున్నాయి. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్, నుస్తులాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, రేణిగుంట గ్రామాలతోపాటు వాటి చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ భూములను రియల్టర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్లాట్లుగా మార్చుతున్నారు. కొన్ని ప్రాంతాలలో సుడా, జీపీల పర్మిషన్ లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

నోటీసులిచ్చినా వృథాయే..

రియల్టర్లు వ్యవసాయ భూములను రెండు, మూడు గుంటల విస్తీర్ణంతో ఒక్కో ప్లాట్ చేసి విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో జీపీ అనుమతి లేకుండా వెంచర్లర్లు వేస్తున్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు  నోటీసులు అందజేసినా పట్టించుకోవడం లేదు. ధరణి పోర్టల్‌‌ ద్వారా వ్యవసాయ భూముల పేరిట 2 నుంచి 3 గుంటల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేసి రిజిస్ర్టేషన్‌‌ చేసి విక్రయిస్తున్నారు. పట్టాదారుల నుంచి విక్రయ ఒప్పందం ద్వారా కొంత బయానాగా చెల్లించి రియల్టర్లు నేరుగా కొనుగోలుదారుల పేరిటే ప్లాట్లను పట్టాదారులతో రిజిస్ర్టేషన్‌‌ చేయిస్తున్నారు. ఒక్కో ప్లాటుకు ఇంత ధర అని నిర్ణయించి వ్యవసాయ భూముల పేరిట రిజిస్ర్టేషన్‌‌ చేయడంతోపాటు కొన్నవారి పేరిట పట్టాదారు పాస్‌‌ పుస్తకాలను జారీ చేస్తున్నారని, కొందరు అధికారులు ఇందుకు సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

పర్మిషన్ లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం 

వ్యవసాయ భూములను వెంచర్లుగా మారిస్తే నాలా పర్మిషన్ తో పాటు గ్రామపంచాయతీ, సుడా పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- కనకయ్య, తహసీల్దార్, తిమ్మాపూర్​